పండగ ప్రయాణమెలా..? | how to travel for festival ? | Sakshi
Sakshi News home page

పండగ ప్రయాణమెలా..?

Published Fri, Oct 4 2013 3:08 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM

how to travel for festival ?

 విజయనగరం టౌన్, న్యూస్‌లైన్:
 సమైక్యాంధ్ర సమ్మె ప్రభా వం జిల్లాపై స్పష్టంగా కనబడుతోంది. ఆర్టీసీ చక్రాలకు బ్రేకులు పడ డంతో ప్రయాణ భారమంతా రైల్వేలపైనే పడింది. దీంతో ఇదే అదునుగా ప్రైవేట్ బస్సుల యజమాను లు టిక్కెట్ రేట్లను అమాంతంగా పెంచేశారు. ఈ నెల 4 తేదీ నుంచి దసరా సెలవులు కావడం ఒకటైతే... ఉత్తరాంధ్రుల కల్పవల్లి పైడితల్లి అమ్మవారి జాతర మరోవైపు..వెరసి వేలాది మంది జిల్లా కు రానున్నారు. సామాన్యులకు కేవలం రైలు ప్రయాణమే తప్ప వేరే మార్గం లేదు. దీని వల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు తీవ్రఇబ్బందులెదుర్కోవలసిన పరిస్థితి దాపురిం చింది. రెండు, మూడు నెలల ముందు నుంచీ రిజర్వేషన్లుచేయించుకున్న వారికి మాత్రమే సాఫీగా గమ్యాలకు చేరే భాగ్యం ఉంటుంది.
 
  సమ్మెను దృష్టిలో ఉంచుకుని ప్రధాన మార్గాల్లో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ ప్రయాణికులకు చుక్క లు కనబడుతున్నాయి. ఈనెల 4 నుంచి 26వ తేదీ వరకూ ప్రధాన రైళ్లన్నింటికీ వెయిటింగ్ లిస్ట్‌లు దర్శనమిస్తున్నాయి. రైళ్లలో రోజూ వారీ ప్రయాణాలు చేసే వారి కన్నా ఇప్పుడు 80 శాతం మంది ప్రజలు అధికంగా రైళ్లనే ఆశ్రయిస్తున్నారు. ఉద్యోగులు, విద్యార్థులతో పాటు సామాన్యులు కూడా మంత్లీ సీజన్ టికెట్ (ఎంఎస్‌టీ)లు తీసుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. దీనివల్ల సాధారణ రోజుల్లో 100 ఎంఎస్‌టీలు అమ్ముడైతే, సమ్మె ఎఫెక్ట్ వల్ల ఈ సంఖ్య రెట్టింపు అయింది. విజయనగరం ప్రధాన జంక్షన్ కావడంతో అటు విశాఖ పట్నం, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, తిరుపతి, సికింద్రాబాద్, అదేవిధంగా ఇటు ఒడిశా, కటక్, కోల్‌కతా, రాయపూర్ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో నిత్యం ప్రయాణాలు చేస్తుంటారు. ఇదే దసరా, పైడితల్లి పండగ సందర్భంగా సా దారణంగా రెండింతలు ప్రయాణికులు వస్తారు. సమ్మె ప్రభావం వల్ల  తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చేవారే ఎక్కువ ని రైల్వే అధికారులు చెబుతున్నారు. సొంతూరు వెళ్లాలనుకునే వారి కి ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఇదే అదునుగా ప్రైవేటు ట్రావెల్స్ నిర్వహకులు రెట్టింపు చార్జీలతో దడ పుట్టిస్తున్నారు.
 
 పెరిగిన రైల్వే ఆదాయం
 సాధారణ రోజుల్లో  రిజర్వేషన్ల ద్వారా  రోజు కు లక్ష రూపాయల ఆదాయం రైల్వేకు చేకూరుతుంది. సమ్మె ప్రభావం వల్ల 10 నుంచి 15 శాతం ఆదాయం పెరిగిందని, అదేవిధంగా  సాధారణ రోజుల్లో ప్యాసింజర్ రైళ్ల ద్వారా రోజుకు సుమారు 3 లక్షల వరకూ రైల్వేకు ఆదాయం చేకూరుతుందని, అయితే సమ్మె ప్రభావం ఎక్కువగా ఉండడంతో  సాధారణ టికెట్లకు సంబంధించి రోజుకు సుమారు 3 లక్షల 60 వేల  వరకూ ఆదాయం   పెరిగినట్లు రైల్వే అధికారులు అంచనా వేశారు.
 
 రెగ్యులర్ రైళ్లపైనే ఒత్తిడి
 దసరా, పైడితల్లి ఉత్సావల సందర్భంగా విజ యనగరం నుంచి రాకపోకలు సాగించే రైళ్లలో ప్రధానంగా  రెగ్యులర్ రైళ్లపైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పరిసర ప్రాంతాల నుంచి  అధిక సంఖ్యలో ప్రజలు పండగ సమయంలో జిల్లాకు చేరుకుంటారు. ప్రైవేటు వాహనాలు వసూలు చేసే రెట్టింపు ధరలు చెల్లించుకోలేక అందుబాటులో ఆర్టీసీ లేకపోవడంతో వారు రైళ్లనే ఆశ్రయించాలి.ఈస్ట్‌కోస్ట్ రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసినప్పటికీ ఈనెల 4 తేదీ నుంచి 23 వరకూ వెయిటింగ్ లిస్ట్ 200 వరకూ ఉంది.
 
 ఇప్పటికే పలు రైళ్లలో ‘నో రూమ్ ’ అని దర్శనమిస్తోండగా మరికొన్ని ప్రధాన ఎక్స్‌ప్రెస్‌లలో వెయిటింగ్ లిస్ట్ బాగా పెరిగింది.  విశాఖ ఎక్స్‌ప్రెస్,  నాగావళి  ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నుమా, కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లలో 150 నుంచి 300 వరకూ వెయిటింగ్ లిస్ట్ ఉంది.  అదేవిధంగా  ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, బొకారో, ప్రశాంతి, హౌరా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, హౌరా- మద్రాసు మెయిల్‌లలో  కొన్నింటిలో ‘నో రూమ్’ దర్శనమివ్వగా, మరికొన్ని ఎక్స్‌ప్రెస్‌లలో  వెయిటింగ్, ఆర్‌ఏసీ ఎక్కువగా ఉంది. విజయవాడ ప్యాసింజరుకు కూడా ఈ నెల 20 వరకూ బెర్తులు ఖాళీల్లేవు.  రిజర్వేషన్ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో అవకాశం ఉండడం వల్ల  రద్దీ మరింతగా పెరిగిపోతుందని రైల్వే  అధికారులు తెలిపారు.
 
 సొంతూరు వెళ్లలేని పరిస్థితి...
 పండగకు ఎలాగైనా సొంతూరు వెళ్లాలనుకునే ప్రయాణికులకు మాత్రం ఇబ్బందులు తప్ప డం లేదు. జిల్లా నుంచి వలస కూలీలుగా హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లిన వారంతా తమ ఊరి పండగకు ఎలాగైనా రావాలనే ఉద్దేశ్యంతో కిటకిటలాడుతున్న రైళ్లలో అయినా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యే క రైళ్లు ఉన్నప్పటికీ అవి కూడా పూర్తిస్థాయిలో రిజర్వేషన్లు నిండిపోవడంతో సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement