సాక్షి, కర్నూలు: సమైక్యాంధ్ర ఆందోళనలు ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఉద్ధృతమయ్యాయి. కర్నూలులో జూనియర్ లెక్చరర్స్ జేఏసీ, గురుకుల పాఠశాలల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి తెలుగు తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు డిపో నుంచి ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ఎదుట మానవహారం నిర్మించారు. రాయలసీమ యూనివర్సిటీలో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. చాణక్యపురి కాలనీవాసులు నగర కురవ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుటనున్న గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఆదోనిలో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షల్లో చిన్నారులు పాల్గొనడం విశేషం. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రోడ్లు ఊడుస్తూ వినూత్న నిరసన తెలిపారు. ఆళ్లగడ్డలో రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. రుద్రవరంలో మేదర సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఆత్మకూరులో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష కొనసాగుతోంది. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఫ్లెక్సీ, దిష్టిబొమ్మను ఆర్టీసీ బస్టాండ్ ఎదుట దగ్ధం చేశారు. స్టార్ టీమ్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను కర్నూలు-గుంటూరు రహదారిపై దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.
పత్తికొండలో జేఏసీ చేపట్టిన రిలేనిరాహార దీక్షలకు మద్దతుగా 2008-డీఎస్‌సీ ఉపాధ్యాయులు దీక్షలో కూర్చొన్నారు. మద్దికెరలో జేఏసీ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, న్యాయవాదులు 48 గంటల దీక్ష చేపట్టారు. తుగ్గలిలో ఎంపీడీఓ, ఎంఈఓ, సర్పంచ్‌లు మానహారం నిర్మించారు. కోడుమూరులో గొర్రెల సంఘం ఆధ్వర్యంలో 300 పైగా గొర్రెలను రోడ్డుపై అడ్డుగా నిలబెట్టి రాకపోకలను స్తంభింపజేశారు. నంద్యాలలో గాంధీ విగ్రహం వద్ద టీచర్స్ జేఏసీ ఆధ్వర్యంలో 101 ప్రదర్శనలు చేసి నిరసన తెలిపారు.
సమైక్యాంధ్రే ధ్యేయం
Published Mon, Sep 16 2013 3:41 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
Advertisement
Advertisement