శ్రేయోభిలాషి.. ఉద్యమం పేరెత్తితే ఊరుకోడు!
జేఏసీ నేత ఇళ్లకు ఓ కాంగ్రెస్ నేత ఫోన్లు
ఉద్యమాన్ని వీడకపోతే నష్టమంటూ బెదిరింపులు
కర్నూలు: ‘హలో.. నేనమ్మా. మీ శ్రేయోభిలాషిని. మీకో విషయం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అందుకే మీ వారికి కాకుండా నేరుగా మీకు ఫోన్ చేశాను. ఏమీ లేదమ్మా. మీ వారు ఇటీవల రెండు నెలల పాటు జీతం లేకుండా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆయన సమ్మెలో పాల్గొన్నందుకు ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి. రెండు నెలల జీతం పోయింది. ఎండలో నిల్చొని గొంతుచించుకుని అరిచారు. ఆ రెండు నెలలు మీరూ మనశ్శాంతిగా లేరు. ఎందుకు మీకీ ఇబ్బందులు చెప్పండి. మీ శ్రేయోభిలాషిగా ఒకటి చెప్పదలచుకున్నాను. మీ వారిని ఇకపై సమ్మెలో పాల్గొనకుండా చూసుకోండి.
ఎందుకిదంతా చెబుతున్నానంటే.. రేపు కేసులు గీసులు పెడితే మీ వారు.. ఆయనతోపాటు మీరు కోర్టుల చుట్టూ తిరగాలి. రెండు నెలల జీతం పోయినా ఫర్వాలేదు. ఇన్నాళ్లు సంపాదించుకున్న ఆస్తులో.. కూడబెట్టుకున్న డబ్బో ఖర్చు చేయాల్సి ఉంటుంది. దయచేసి మీ వారిని ఇకపై ఉద్యమంలోకి వెళ్లకుండా జాగ్రత్తపడింది. మీకేదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఉంటానమ్మా.’’ ఇదంతో ఎవరో బంధువులో, స్నేహితులో చెప్పారనుకుంటే పొరబాటు.
అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత ఒకరు మంగళవారం ఉద్యమ వీరుల నివాసాలకు ఫోన్ చేసి మాట్లాడిన తీరు. ఉద్యమాల్లో పాల్గొనే ముఖ్య జేఏసీ నాయకులకు ఇలాంటి ఫోన్లు చేసి బెదిరించటంతో పాటు కుటుంబ సభ్యుల మధ్య కలహాలు పెట్టేలా వ్యవహరించడం చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత తాను కరుడుగట్టిన సమైక్యవాదినంటూ ఇటీవల ఆవేశంతో ఊగిపోయారు. పదవికి రాజీనామా చేయమని పలుమార్లు సమైక్యవాదులు ఆయనను డిమాండ్ చేశారు.
అందుకు ఆయన ‘మీరు చెప్పినా.. చెప్పకపోయినా నేను సమైక్యవాదినే’ అంటూ ప్రకటించారు. తాజాగా ఆయనే జేఏసీ నాయకుల నివాసాలకు ఫోన్ చేసి హెచ్చరిక తరహాలో మాట్లాడటాన్ని సమైక్యవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా ‘విభజనకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న ఉద్యమకారులపైనా అక్రమ కేసులు బనాయించి బొక్కలో తోస్తే వారంతట వారే సమ్మె విరమించుకుంటారు’ అంటూ ఒత్తిడి తీసుకొస్తున్నట్లు కొందరు పోలీసులే వాపోతున్నారు.
ఇటీవల కాలంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు ఆయన ఆదేశాలే కారణంగా తెలుస్తోంది. ‘మాకున్న ఒత్తిళ్లు మాకున్నాయి. మీరూ మాకు సహకరించండి’ అంటూ పోలీసులు ఉద్యమకారులను కోరడం ఆ నేత ఉద్యమాన్ని ఏ స్థాయిలో అణచివేస్తున్నాడో తెలియజేస్తోంది.