కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఉద్యమాలు చేస్తున్న సమైక్యవాదులపై అధికార ముసుగులో దాడులు చేస్తే సహించబోమని వైఎస్సార్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్వీ మోహన్‌రెడ్డి నాయకత్వంలో శ్రీకృష్ణదేవరాయల సర్కిల్‌లో ఆ పార్టీ కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి ఐదోరోజుకు చేరుకున్నాయి. ఆదివారం ఈ దీక్షలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఉద్యమంలో పాల్గొంటున్న వారిని అరెస్ట్ చేస్తూ..అక్రమ కేసులు బనాయిస్తూ అధికార పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీమాంధ్రలో రెండు నెలలకు పైగా ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోందని తెలిపారు.
ఉద్యమ తీవ్రతను యుపీఏ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో ఈ ప్రాంత ఎంపీలు, కేంద్ర మంత్రులు విఫలమయ్యారని ఆరోపించారు. అలాగే యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీకి భయపడి తప్పుడు నివేదికలు ఇవ్వడంతో రాష్ట్ర విభజన ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఇలాంటి నేతలను నియోజకవర్గాలకు వస్తే ప్రజలు తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించినప్పుడే కేంద్ర మంత్రులు, ఎంపీలు పదవులకు, పార్టీకి రాజీనామాలు చేసి ఉంటే యుపీఏ ప్రభుత్వం దిగొచ్చేదని తెలిపారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు దగ్గరుండి టీ నోట్‌ను ఆమోదించేందుకు పరోక్షంగా సహకరించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఈ విషయమై సమాచారం ఇచ్చినా అడ్డుకోలేకపోయారన్నారు. సమైక్య రాష్ట్రం కోసం పోరాడేందుకు పార్టీ జెండాలతోనే కలిసిరావాలని తమపార్టీ అధినేత ఇచ్చిన పిలుపును చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర విభజనకు కారకులవుతున్న వీరు.. ప్రజాకాంక్ష మేరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విమర్శలు చేయడం తగదన్నారు.
రిలే దీక్షల్లో 28వ వార్డుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు ఖాదర్ హుసేన్, ఖాదర్‌వలీల ఆధ్వర్యంలో అబ్దుల్హ్రీమ్, అబ్దుల్ సలాం, సుభాన్, నజీర్, అన్వర్ బాషా, ఖాదర్, గఫూర్ మియ్యా, బాబు, వహీద్, చాంద్‌బాషా, ఫరూక్, అయూ బ్, బాషా, మహబూబ్ బీ, నసీమా, జహీరాబీ, మల్లికాబీ, శాలిబీ, మద్దమ్మ, లక్ష్మమ్మ, పద్మావతి, సుంకులమ్మ, లక్ష్మిదేవి, యశోద, నాగమ్మ తదితరులు కూర్చున్నారు.
సమైక్యవాదులపై దాడులను సహించం
Published Mon, Oct 7 2013 3:39 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement