సమైక్య బంద్ సక్సెస్ | samaikyandhra bandh Success | Sakshi
Sakshi News home page

సమైక్య బంద్ సక్సెస్

Published Tue, Sep 24 2013 11:57 PM | Last Updated on Fri, Sep 1 2017 11:00 PM

samaikyandhra bandh Success

 కర్నూలు, న్యూస్‌లైన్:సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు మంగళవారం నిర్వహించిన బంద్ కార్యక్రమం నగరంలో విజయవంతమైంది. ఈనెల 16వ తేదీన సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రకటించిన ఉద్యమ కార్యచరణలో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు బంద్‌లో పాల్గొన్నారు. ఉద్యోగులు గ్రూపులుగా విడిపోయి నగరంలో పర్యటించి అనంతరం జాతీయ రహదారులను దిగ్బంధించారు. 25, 26 తేదీల్లో ప్రయివేటు వాహనాలు అడ్డుకునే కార్యక్రమానికి సిద్ధమయ్యారు. నగరంలో వ్యాపారవర్గాలు, హోటళ్లు, పెట్రోల్ బంకు, సినిమా థియేటర్స్ యాజమాన్యాలు స్వచ ్చంధంగా బంద్‌కు సహకరించారు. మధ్యాహ్నం వరకు ఆటోలు కూడా తిరగకపోవడంతో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.
 
 తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు కాలినడకన వెళ్తుండడం కనిపించింది. తుంగభద్ర బ్రిడ్జి వద్ద నుంచి కార్బైడ్ ఫ్యాక్టరీ వరకు 44వ జాతీయ రహదారిపై ఐదు బృందాలుగా, నంద్యాల చెక్‌పోస్టు, పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వద్ద 18వ నెంబర్ జాతీయ రహదారిపై రెండు జట్లుగా ఏర్పడి ఉద్యోగులు అడ్డుకోవడంతో వాహనాలన్నీ నగర శివారుల్లోనే నిలిచిపోయాయి. గుత్తి పెట్రోల్ బంకు వద్ద వాణిజ్య పన్నుల శాఖ, ఎన్‌సీసీ, ఆడిట్, సంక్షేమ భవన్ ఉద్యోగులు, రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు, కల్లూరు హంద్రీ బ్రిడ్జి వద్ద పశు సంవర్ధక శాఖ, చెన్నమ్మ సర్కిల్ వద్ద కల్లూరు రైతు సంఘం ఆధ్వర్యంలో రహదారిని దిగ్బంధించారు. డిగ్రీ కళాశాలల అధ్యాపక జేఏసీ, ఉపాధ్యాయ జేఏసీ వారు తుంగభద్ర బ్రిడ్జి వద్ద, కలెక్టరేట్ వద్ద వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు రాస్తారోకో నిర్వహించారు.
 
 సంక్షేమ భవన్‌లో రిలే నిరాహార దీక్షలు యధావిధిగా కొనసాగుతున్నాయి. నంద్యా ల చెక్‌పోస్టు వద్ద వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు, ప్రభుత్వ వాహన డ్రైవర్లు, రెవెన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఒకజట్టు, పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వద్ద మరో జట్టు, బళ్లారి చౌరస్తాలో ఆర్టీసీ ఉద్యోగులు, పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖ ఉద్యోగులు మరో జ ట్టుగా ఏర్పడి రోడ్లపై బైఠాయించారు. జెడ్పీ ఉద్యోగులు జట్లుగా ఏర్పడి నగరంలో పర్యటించి వ్యాపార, వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు, పోస్టాఫీసులను మూయిం చారు. విప్లవ గీతాల రచయిత వంగపండు ప్రసాదరావు నేతృత్వంలో జిల్లా పరిషత్ సమీపంలోని కల్కూరు హోటల్ దగ్గర ఆటా పాట కార్యక్రమం జరిగింది. 
 
 వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ
 సమైక్య పరిరక్షణ వేదిక ఇచ్చిన బంద్ పిలుపునకు వైఎస్సార్సీపీ సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తూ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి, యువజన విభాగం నగర కన్వీనర్ రాజా విష్ణువర్ధన్‌రెడ్డి నేతృత్వంలో మధ్యాహ్నం వరకు బైక్ ర్యాలీ ద్వారా బంద్‌ను పర్యవేక్షించారు. నగర కన్వీనర్ బాలరాజు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, నిడ్జూరు భూపాల్ రెడ్డి, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, డాక్టర్ గిడ్డయ్య, పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు కోట్ల హరిచక్రపాణిరెడ్డి, మణిగాంధీ, మాజీ కార్పొరేటర్లు ఎన్‌వి.రమణ, పులిజాకోబ్ తదితరులు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఎస్వీ కాంప్లెక్స్ నుంచి కోట్ల సర్కిల్, పాతబస్టాండ్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, ఉస్మానియా కళాశాల, కిడ్స్ వరల్డ్, రాజ్‌విహార్, కలెక్టరేట్, సీక్యాంప్, క్రిష్ణానగర్, బళ్లారి చౌరస్తా, కొత్తబస్టాండ్, మౌర్య ఇన్, ఐదు రోడ్ల కూడలి, రైల్వే స్టేషన్, వెంకటరమణ కాలనీ, సంతోష్‌నగర్, తుంగభద్రా బ్రిడ్జి, మామిదాలపాడు వై.జంక్షన్, ప్రకాష్‌నగర్ మీదుగా ఎస్వీ కాంప్లెక్స్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి బంద్‌ను పర్యవేక్షించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement