మంజీర తీరం భక్తజన సాగరంగా మారింది. మంజీర పరవళ్లలో భక్తులు పుణ్య స్నానాలు చేశారు. వేలాదిమంది ఏడుపాయలకు తరలిరావడంతో దట్టమైన దండకారణ్యం జనారణ్యంగా మారింది.
పాపన్నపేట, న్యూస్‌లైన్:
మంజీర తీరం భక్తజన సాగరంగా మారింది. మంజీర పరవళ్లలో భక్తులు పుణ్య స్నానాలు చేశారు. వేలాదిమంది ఏడుపాయలకు తరలిరావడంతో దట్టమైన దండకారణ్యం జనారణ్యంగా మారింది. సుమారు 60 వేల మందికిపైగా భక్తులు మాఘ స్నానాలు చేశారు. పోతరాజుల గావుకేకలు.. శివసత్తుల సిగాలు.. డప్పుచప్పుళ్ల మధ్య బోనాలు.. తలనీలాల మొక్కులు.. జాతరలో జానపద సంస్కృతికి అద్దంపట్టాయి. తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన ఏడుపాయల్లో గురువారం మాఘ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దుర్గమ్మతల్లి ఆలయాన్ని చుట్టుముడుతూ మంజీర నది ఏడుపాయలుగా చీలి ప్రవహించే సుందర దృశ్యం ఏడుపాయల్లోనే కనిపిస్తుంది. జనమే జయుని సర్పయాగస్థలి నుంచి ప్రవహించే మంజీరా నదిలో మాఘ స్నానాలు చేస్తే పుణ్యం లభిస్తుందన్న ఉద్దేశంతో యేటా వేలాది మంది భక్తులు ఏడుపాయలకు వస్తుంటారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామునుంచే మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు పలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఏడుపాయలకు తరలివచ్చారు.
ఘనపురం ప్రాజెక్ట్ నుంచి విడుదల చేసిన మంజీర నీటిలో పుణ్య స్నానాలు చేశారు. చెక్‌డ్యాంలో, అమ్మవారి ఆలయం ముందు కూడా భక్తులు స్నానాలాచరించారు. అనంతరం క్యూలైన్లలో బారులు తీరి దుర్గమ్మతల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 5 గంటల నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. క్యూ లైన్లు కిటకిటలాడాయి. అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఏడుపాయల్లోని గుట్టలు, చెట్లు జనాలతో నిండిపోయాయి. కొంతమంది భక్తులు బోనాలు, తలనీలాలు, ఒడిబియ్యం అమ్మవారికి సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. సంతానం కోసం మరికొంతమంది భక్తులు సంతానగుండంలో స్నానాలు అచరించారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, డీసీసీ కార్యదర్శి మల్లప్పలు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
సౌకర్యాల ఏర్పాటు..
ఉత్సవాలకు తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఈఓ వెంకట కిషన్‌రావు పూర్తి ఏర్పాట్లు చేశారు. స్నానాల కోసం ఘనపురం ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడంతో చెక్‌డ్యాం పొంగిపొర్లి అమ్మవారి ఆలయం ముందు నుంచి మంజీరానది పరవళ్లు తొక్కింది. దీంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తాగునీటికి ఇబ్బందులు కలగకుండా ఆర్‌డ బ్ల్యూఎస్ అధికారులు చర్యలు చేపట్టారు. పొడ్చన్‌పల్లి వైద్య సిబ్బంది తమ సేవలందించారు. మెదక్ డీఎస్పీ గోద్రూ, పాపన్నపేట ఎస్‌ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు సిబ్బంది తమ సేవలందించారు.