
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దశల వారీ మద్య నిషేధ ప్రభావాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన మూడు నెలల పాలనలో ప్రజల కళ్లకు కట్టినట్లు ఆచరణలో చూపించారు. దీంతో మద్యం ఆదాయం భారీగా తగ్గిపోయింది. అయినా మహిళల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. గత ఏడాది ఆగస్టు వరకు పోల్చి చూస్తే ఈ ఏడాది ఆగస్టు వరకు ఎక్సైజ్ డ్యూటీ ఆదాయం ఏకంగా రూ.678.03 కోట్లు తగ్గిపోయిందని అకౌంటెంట్ జనరల్ నివేదిక స్పష్టం చేస్తోంది. మద్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవ్వడం స్వయంగా చూసిన వైఎస్ జగన్ దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే ఆ మేరకు ప్రకటన చేశారు. ఇందులో భాగంగా అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే మద్యం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా అసెంబ్లీ తొలి బడ్జెట్ సమావేశాల్లోనే చట్టాన్ని సవరించారు. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా ఇప్పటికే 400కు పైగా మద్యం దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ఇక అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రైవేట్ మద్యం దుకాణాలన్నీ బంద్ కానున్నాయి.
మద్యం దుకాణాల తగ్గింపు
మరోవైపు గతంలో మాదిరి మద్యం విక్రయాలకు టార్గెట్లు పెట్టలేదు. ఆదాయం తగ్గడానికి వీల్లేదని, వీలైనంత ఎక్కువ మద్యం తాగించాలనే చాటుమాటు ఆదేశాలు కూడా ఇవ్వలేదు. ఫలితంగా మద్యం ఆదాయం తగ్గిపోవడమే ముఖ్యమంత్రి జగన్‌చిత్తశుద్ధికి నిదర్శనం. వచ్చే నెల నుంచి 20 శాతం మద్యం దుకాణాలను అంటే.. 4,380 నుంచి 3,500కి తగ్గించేస్తున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి మద్యం దుకాణాలు అక్టోబర్ 1వ తేదీ నుంచి కనిపించవు. ఒకరికి ఎలాంటివైనా సరే మూడు బాటిళ్లకు మించి విక్రయించరు. ఇప్పటికే బెల్ట్ షాపులు మూతపడ్డాయి. డి–అడిక్షన్ కేంద్రాలకు నిధులను రూ.500 కోట్లకు పెంచారని, ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించడం వల్ల కొత్తగా 16 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment