ఆదివారం జరిగిన ప్రజా సదస్సుకు హాజరైన భారీ జన సందోహం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: విపక్ష నేత చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లె జన జాతరను తలపించింది. ఏ వైపు చూసినా వేలాది మామిడి తోరణాలతో ఉత్సవ శోభను సంతరించుకుంది. వికేంద్రీకరణకు మద్దతుగా వెల్లువలా వచ్చిన ప్రజలతో పండుగ వాతావరణం కనిపించింది. కనీవినీ ఎరుగని రీతిలో.. బహిరంగ సభను తలపిస్తూ ‘పాలన వికేంద్రీకరణ ప్రజాసదస్సు’ సాగింది. ఆ గ్రామ చరిత్రలో బహిరంగ సభను ప్రజలు చూసింది లేదు. రచ్చబండ సమావేశాలు మినహా ఇప్పటివరకూ ఎలాంటి సభలను గ్రామంలో నిర్వహించిన దాఖలాలు లేవు. సదస్సుకు 25 వేల మందికి పైగా హాజరు కాగా.. అనేక మంది తమ ఇళ్లల్లోనే ఉండి వక్తల మాటలను శ్రద్ధగా ఆలకించారు. చుట్టుపక్కల గల 15 గ్రామాల ప్రజలు సైతం ప్రసంగాలను వినేందుకు వీలుగా వందలాది మైక్ సెట్లు ఏర్పాటు చేశారు.
కాలూరు క్రాస్, శ్రీనివాస మంగాపురం, నరసింగాపురం క్రాస్, రంగంపేట మీదుగా నారావారిపల్లె వరకూ దాదాపు 8 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి మరీ.. మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించారు. ఇందుకు తగిన ఏర్పాట్లను 48 గంటల్లో చేపట్టిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నారావారిపల్లె చరిత్రను తిరగరాశారని చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. పాలన వికేంద్రీకరణపై ఆదివారం నిర్వహించిన ప్రజా సదస్సుకు ప్రభుత్వ ముఖ్యులు, మంత్రులతోపాటు ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఆరణి శ్రీనివాసులు, బియ్యపు మధుసూదనరెడ్డి, వెంకటేగౌడ తదితరులు హాజరయ్యారు. సదస్సులో మాట్లాడిన వక్తలు ఏమన్నారంటే..
ప్రజాసదస్సును జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న ప్రభుత్వ సలహాదారుడు అజేయ కల్లం, వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు
అభివృద్ధి, ప్రజల ముఖ్యం
వైఎస్ రాజశేఖరరెడ్డి వెలుగు లాంటి వ్యక్తి అయితే, చంద్రబాబు చీకటి లాంటి వ్యక్తి. అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు అనేవి వైఎస్ కుటుంబానికి ఉంటే.. అవకాశాన్ని అందిపుచ్చుకుని తనూ, తన వారి శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తి చంద్రబాబు. రాష్ట్రమంతా అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం సరైంది కాబట్టే, చంద్రబాబు పుట్టిన గడ్డ నారావారిపల్లె ప్రజలు పాలన వికేంద్రీకరణకు మద్దతుగా నిలుస్తున్నారు.
– సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం సలహాదారు (ప్రజా వ్యవహారాలు)
చరిత్రను వక్రీకరించటంలో చంద్రబాబు దిట్ట
సభలో మాట్లాడుతున్న సీఎం సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. వేదికపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు
చరిత్రను వక్రీకరించటంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు దిట్ట. తన చాతుర్యం ప్రదర్శించి ఎదుటి వారిపై బురద చల్లడంలో నేర్పరి. రాష్ట్ర విభజన సమయంలో శ్రీకృష్ణ కమిటీ, రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను అమలు చేయలేదు సరికదా కనీస చర్చకు కూడా ఆహ్వానించలేదు. అన్ని కమిటీలూ పాలనా వికేంద్రీకరణ చేయాలని సూచించాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర వాసులు నీటి కోసం, కూటి కోసం అల్లాడుతుంటే.. అమరావతిలో రేట్లు.. రూ.కోట్ల కోసం ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉంది.
– అజేయకల్లం, ప్రభుత్వ సలహాదారు, పాలనా వ్యవహారాలు
నారావారిపల్లెపై ప్రేమ ఉంటే..
మాజీ సీఎం చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ప్రేమలో ఒక శాతమైనా నారావారిపల్లెపై ఉంటే ఈ గ్రామం పరిస్థితి ఇలా ఉండేది కాదు. ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా నిపుణులు కమిటీల సూచనలతో 3 రాజధానులు, 4 ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వచ్చింది.
– కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి
అందుకే చంద్రబాబును కుప్పం పంపారు
నారావారిపల్లె చాలా మంచిది. ఇక్కడి ప్రజలు తెలివైన వారు. చంద్రబాబు మనస్తత్వం తెలియడంతో రెండోసారి ఎమ్మెల్యేగా ఓడించి కుప్పం నియోజకవర్గానికి పంపారు.
– కె.నారాయణస్వామి, డిప్యూటీ సీఎం
15 ఏళ్లు సీఎంగా చేసినా..
చంద్రబాబు దాదాపు 15 సంవత్సరాలు సీఎంగా ఉన్నా రాయలసీమకు ప్రయోజనం దక్కకపోగా, సినిమాల ద్వారా విష ప్రచారం చేయించారు. సొంత జిల్లా చిత్తూరులో ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేకపోయారు.
– భూమన కరుణాకర్‌రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే
దమ్మున్న నాయకుడు జగన్
కులాలు, మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అధికార వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందే. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలంతా స్వాగతిస్తున్నారు కాబట్టే ఈ కార్యక్రమానికి ఇంత పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు.
– చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment