
రైళ్లలో ఎలుకల వేట
1,054.. సగటున నెలకు చిక్కుతున్న మూషికాల సంఖ్య
సాక్షి, హైదరాబాద్: తిండి వాసన వచ్చిందంటే చాలు.. ఎలుకలు, బొద్దింకలు అక్కడికి చేరుకోవటం పరిపాటి. కాస్త మరుగు ఉందంటే వాటికి తిరుగే ఉండదు. ఈ క్రమంలో చిరుతిండి దండిగా దొరికే రైలు బోగీలను ఇవి ఆవాసాలుగా చేసుకున్నాయి. ప్రయాణికులు పారేసే ఆహార పదార్థాలు తింటూ అందులోనే తిష్ట వేశాయి. వాటి వల్ల ప్రయాణికులకు పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఈ అంశంపై రైల్వే శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని మరీ వాటి వేట ప్రారంభించారు. ఈ ప్రయత్నంలో కొంతమేర విజయం సాధించినా, ప్రయాణికులు బోగీల్లో ఎక్కడపడితే అక్కడ మిగిలిపోయిన చిరుతిండి పడేస్తుండటంతో ఎలుకలు, బొద్దింకల నిర్మూలన పూర్తిగా సాధ్యంకాలేదు. ఇదే సమయంలో విదేశీ తరహాలో రైళ్లను, రైల్వే స్టేషన్ల ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన రైల్వే బోర్డు.. పరిశుభ్రత కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఎలుకలు, బొద్దింకలపై కూడా యుద్ధాన్ని తీవ్రం చేశారు. ప్రత్యేక సిబ్బందిని వినియోగించి మరీ ఆ కసరత్తును ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.
- {పస్తుతం నెలకు సగటున 1,054 ఎలుకలను పడుతున్నారు. ఈ సంఖ్య ఈ ఏడాది మే నెల వరకు కేవలం 457 మాత్రమే ఉండేది.
- ఇక సగటున నెలకు 33,237 బొద్దింకలను చంపుతున్నారు. ఇంతకుముందు ఈ సంఖ్య 20,834 మాత్రమే.
- ఏసీ బోగీల్లో అందించే బెడ్‌రోల్స్‌లో నల్లుల బెడద లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఏసీ బోగీలను ప్రతి 15 రోజులకోసారి, సాధారణ బోగీలను నెలకోసారి పూర్తిస్థాయిలో క్రిమిసంహార మందులతో శుభ్రం చేస్తున్నారు.
- రైళ్లలోని 709 ఏసీ బోగీలు, 3,525 సాధారణ బోగీలు, 53 ప్యాంట్రీ కార్లలో నిరంతరం ఎలుకలు, బొద్దింక ల నివారణ చర్యలు తీసుకుంటున్నారు.
- రైళ్లలో విద్యుత్తు వైర్లను ఎలుకలు కొరికి తెంపేసే సమస్య కూడా బాగా తగ్గింది. ఫలితంగా ఏసీ బోగీల్లో షార్ట్‌సర్క్యూట్ భయం కూడా తగ్గుతోంది.
ప్రయాణికులు సహకరించాలి
‘‘ప్రయాణికులకు ఎలుకలు, బొద్దింకలు, నల్లులతో ఇబ్బంది లేకుండా మా సిబ్బంది నిరంతరం కృషి చేసి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. మిగిలిపోయిన చిరుతిండి, పళ్లతొక్కలు వంటివి బోగీల్లో పడేయకుండా ప్రయాణికులు మాకు సహకరిస్తే ఈ సమస్య పూర్తిగా నివారించగలం. అలాగే రైల్వే స్టేషన్ ప్రాంగణాల్లో కూడా చెత్తకుండీలను వినియోగిస్తూ సహకరించాలి.’’
- సాంబశివరావు, దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో