అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: పిచ్చిదని ముద్ర వేసి భార్యను వదిలించుకోవడానికి ఓ భర్త ప్రయత్నించగా, చావైనా, బతుకైనా అతనితోనే అంటూ ఆ మహిళ భర్త ఇంటి ముందు బైఠాయించింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటోంది. ఇందుకు సంబంధించి పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాయదుర్గానికి చెందిన గాయత్రికి, అనంతపురంలోని ఓబుళదేవనగర్‌కు చెందిన రమేష్‌తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పట్లో ఆమె తల్లిదండ్రులు రూ.50 వేల వరకట్నం, 15 తులాల బంగారం ఇచ్చారు. ఓ కొరియర్ సంస్థలో సర్వీస్ బాయ్‌గా పని చేస్తున్న రమేష్ రెండేళ్లపాటు భార్యను బాగానే చూసుకున్న అతనిలో క్రమేణా మార్పు వచ్చింది. తరచూ ఆమెను మాటలతో వేధించేవాడు. ఈ క్రమంలో ఆమె గర్భిణిగా ఉన్న సమయంలో భర్త కర్రతో దాడి చేయడంతో తలకు గాయమై మానసిక అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను పుట్టింటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు చికిత్స చేయించారు.
అమె ప్రసవించిన అనంతరం కూడా అల్లుని వద్దకు పంపకుండా ఇంట్లోనే ఉంచుకున్నారు. ఆరోగ్యం పూర్తిగా కుదుట పడడంతో ఆదివారం భర్త ఇంటి వద్దకు వచ్చింది. అప్పటికే మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న అతను భార్య వచ్చిన విషయం గుర్తించి, ఆమెను లోనికి రానివ్వకుండా తలుపులకు తాళం వేసుకుని వెళ్లిపోయాడు. దీంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆమె ఇంటి ముందే బైఠాయించింది. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు.
పిచ్చిదాన్నంటున్నారు..
Published Mon, Jan 6 2014 4:11 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement