
విజయనగరం టౌన్: అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య ప్రసవానికి పుట్టింటికి వెళ్లగా ఎంచక్కా ప్రియురాలితో సహజీవనం సాగిస్తున్న ఓ ప్రబుద్ధుడి బండారం భార్య బయటపెట్టిన సంఘటన ఇది. విజయనగరంలో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలివి. పట్టణంలోని ధర్మపురి వసంత్‌విహార్ ఎఫ్ బ్లాక్‌లో నివాసముంటున్న వినోద్ విశాఖలోని ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం సునీత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో రూ. 30 లక్షల కట్నం, 25 తులాల బంగారం తీసుకున్నాడు. వారిద్దరికి ఓ పాప పుట్టింది. సునీత డెలివరీకి పుట్టింటికి వెళ్లగా వినోద్ తన ప్రియురాలు, సహోద్యోగి అయిన యువతితో సహజీవనం చేయసాగారు. బిడ్డ పుట్టినా పెద్దగా పట్టించుకోకపోవడంతో అనుమానం వచ్చిన భార్య విచారించగా అసలు విషయం తెలిసింది. వెంటనే ఈ విషయాన్ని అత్తమామలు, ఆడపడుచుకు చెప్పినా వారు స్పందించలేదు.
భర్త ప్రియురాలితో విశాఖలో సహజీవనం చేస్తున్న విషయం తెలుసుకుని సునీత ఈ ఏడాది మే నెలలో అక్కడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు వినోద్‌కు కౌన్సెలింగ్ ఇచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు. అనంతరం ఇటీవల తన భర్త వినోద్, ప్రియురాలితో కలసి విజయనగరంలోని స్వగృహంలో ఉన్నట్లు తెలుసుకున్న మహిళా సంఘ సభ్యులతో కలిసి వెళ్లి ఇద్దరినీ రెడ్‌హ్యాండడ్‌గా పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్సై వెంకటరావు వినోద్‌ను ప్రియురాలితోసహా స్టేషన్‌కు తరలించారు. మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ కె.కుమారస్వామి మాట్లాడుతూ వినోద్‌కు కౌన్సెలింగ్ నిర్వహించి బాధితురాలికి న్యాయం చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment