
భర్తను నరికి చంపిన భార్య
రోజూ వేధింపులకు తట్టుకోలేక వివాహిత భర్తను కత్తితో నరికి చంపిన సంఘటన మండలంలోని సంకాడ కొత్తూరులో గురువారం చోటు చేసుకుంది...
గూడెంకొత్తవీధి: రోజూ వేధింపులకు తట్టుకోలేక వివాహిత భర్తను కత్తితో నరికి చంపిన సంఘటన మండలంలోని సంకాడ కొత్తూరులో గురువారం చోటు చేసుకుంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..గ్రామానికి చెందిన వజ్రపు సోమరాజు (32)కు అమ్మాజితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. కుటుంబాన్ని భర్త సరిగా పట్టించుకునేవాడు కాదు.
కూలి పనులకు వెళ్లి అమ్మాజీ కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. సోమరాజు రోజు పూటుగా మద్యం తాగి వచ్చి అనుమానంతో అమ్మాజీని వేధించేవాడు. ఆమె సతమతమయ్యేది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయాన్నే పూటుగా మద్యం తాగి వచ్చిన సోమరాజు భార్యపై కత్తితో దాడికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది.
ప్రాణరక్షణ కోసం అమ్మాజీ భర్తపై తిరగబడింది. అతని చేతిలో ఉన్న కత్తిని లాక్కొని ఎదురుదాడికి దిగింది. మెడపై కత్తితో దాడి చేసింది. సోమరాజు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. సమాచారం మేరకు ఎస్‌ఐ నరసింహమూర్తి సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.