తణుకు : పెళ్లయిన నాటినుంచీ వేధింపులు.. అనుమానంతో సాధిం పులు.. వెరసి ఆ దంపతుల మధ్య నిత్యం ఘర్షణలు. ఈ పరిస్థితులు భర్త చంపే స్థాయికి తీసుకెళ్లాయి. తణుకు పట్టణంలో ఈనెల 4న అర్ధరాత్రి జరిగిన ఇప్పిలి రమేష్ (31) హత్య కేసులో నిందితురాలిలా ఉన్న అతడి భార్య వెంకటలక్ష్మిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ ఆర్.అంకబాబు వెల్లడించారు. స్థానిక పాతూరు ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని చాకలి వీధిలో నివాసం ఉంటున్న ఇప్పిలి రమేష్, వెంకటల క్ష్మిలకు పన్నెండేళ్ల క్రితం వివాహ మైంది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లయిన నాటినుంచి రమేష్ తనను అనుమానిస్తూ వేధింపులకు గురి చేసేవాడని, రోజూ తాగి వచ్చి గొడవ పడేవాడని నిందితురాలు వెంకటలక్ష్మి వాంగ్మూలం ఇచ్చిందని సీఐ తెలిపారు.
ఈనెల 4 అర్ధరాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో ఆవేశం తట్టుకోలేని రమేష్ తాను చనిపోతానంటూ నైలాన్ తాడు తీసుకుని బెదిరించాడని చెప్పారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న వెంకటలక్ష్మి ‘నువ్వు చనిపోయేదేంటి. నేనే చంపేస్తా’నంటూ తాడు లాగి మెడకు ఉరి బిగుసుకునేలా చేసిందన్నారు. అనంతరం రమేష్ మృతదేహాన్ని గుమ్మం బయటకు ఈడ్చుకొచ్చి ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు వెంకటలక్ష్మి నమ్మించే ప్రయత్నం చేసిందన్నారు. వెంకటలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించగా, తన భర్తను తానే చంపినట్టు ఆమె అంగీకరించిందని తెలిపారు. ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు పంపినట్టు చెప్పారు.
భర్తను చంపిన భార్య అరెస్ట్
Published Tue, Mar 10 2015 3:00 AM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM
Advertisement