భర్తను హత్య చేసిన భార్య | husband killed by wife | Sakshi
Sakshi News home page

భర్తను హత్య చేసిన భార్య

Dec 21 2014 12:49 AM | Updated on Jul 27 2018 2:18 PM

భర్తను హత్య చేసిన భార్య - Sakshi

భర్తను హత్య చేసిన భార్య

మద్యం సేవించి అరాచకం చేస్తున్న భర్త వేధింపులను తట్టుకోలేక భార్య కిరాతకంగా చంపిన సంఘటన

 కె.గంగవరం; మద్యం సేవించి అరాచకం చేస్తున్న భర్త వేధింపులను తట్టుకోలేక భార్య కిరాతకంగా చంపిన సంఘటన సంచలనం రేకెత్తించింది. మద్యం తాగి వేధింపులకు గురిచేస్తున్న భర్తను గెడ్డపారతో తలపై గట్టిగా కొట్టడంతో మృతి చెందిన సంఘటన కె. గంగవరంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం, వైఎస్సార్ కాలనీకి చెందిన అనుసూరి శ్రీను(35)కి అదే గ్రామానికి చెందిన దుర్గతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 11 ఏళ్ల లలితాదేవి, 8 ఏళ్ల కల్యాణి అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ వ్యవసాయ కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మొదట్లో కాపురం సజావుగా సాగినా భర్త శ్రీను మద్యం, పేకాటకు బానిసగా మారి దుర్గను తరచూ వేధించేవాడు.
 
 రెండేళ్ల క్రితం భర్తపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు శ్రీనుపై కేసు కూడా నమోదు చేశారు. ఇరు కుటుంబాల పెద్దలు సజావుగా కాపురం చేసుకోవాలని హితవు చెప్పడంతో దుర్గ తిరిగి భర్తతో కలసి కాపురం చేసుకుంటోంది. ఇటీవల భర్త శ్రీను తరచూ మద్యం సేవించి కొట్టేవాడు. శుక్రవారం ఉదయం మద్యం సేవించి దుర్గను శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు. రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. భర్త చేష్టలకు విసిగిపోయిన భార్య గడ్డపారతో భర్త ముఖంపై పలుసార్లు మోదింది.
 
 గమనించిన స్థానికులు ఆమె చేతిలో గడ్డపారను లాక్కున్నారు. సహనం కోల్పోయిన దుర్గ ఇంట్లో ఉన్న మరో గడ్డపారతో భర్త శ్రీను తల వెనుక బలంగా కొట్టింది. తీవ్ర గాయాలైన శ్రీనును స్థానికులు ఆటోలో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. శ్రీను పరిస్థితి విషమించటంతో ఏరియా ఆసుపత్రి అంబులెన్స్‌లో కాకినాడ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. శ్రీనివాస్ తల్లి భద్రం ఫిర్యాదు మేరకు రామచంద్రపుం సీఐ కాశీవిశ్వనాధ్, ఎస్సై వి.పెద్దిరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామచంద్రపురం డీఎస్పీ రవీంద్రనాధ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement