వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని..
జీవితాంతం తోడూనీడగా ఉంటానని ప్రమాణం చేసి తాళికట్టించుకుంది.. పద్నాలుగేళ్లు అతడితో జీవితాన్ని పంచుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.. వివాహేతర బంధం మోజులో పడి చివరకు కట్టుకున్న భర్త ఊపిరినే తీసేసింది.. ఆ ఇల్లాలు. ఈ దారుణ ఘటన బీబీనగర్ మండల కేం ద్రంలో ఆదివారం వెలుగుచూసింది. పోలీ సులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
-బీబీనగర్
బీబీనగర్ మండలం పడమటిసోమారం గ్రామానికి చెందిన మెడబోయిన ప్రభాకర్‌కు(32) మండల కేంద్రానికి చెందిన గుండెగళ్ల సత్తయ్య కూతురు రేణుకతో 14ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. జీవనోపాధి కోసం ప్రభాకర్ తన కుటుంబంతో పదేళ్ల క్రితం బీబీనగర్‌కు వలసవచ్చాడు. రైల్వేస్టేషన్ సమీపంలో తన అత్తమామ ఇంటి పక్కనే అద్దె ఇంట్లో నివాసాముంటూ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా ప్రభాకర్ భార్య రేణుక మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుసుకున్నాడు. ప్రవర్తన మార్చుకోవాలని నచ్చజెప్పాడు. మారకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు.
దీంతో రేణుక తన కార్యకలాపాలకు అడ్డొస్తున్న భర్తనే ఎలాగైనా కడతేర్చాలని నిశ్చయించుకుంది. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి ప్రభాకర్ నిద్రిస్తున్న సమయంలో రేణుక గొంతు నులిపి చంపివేసింది. ఈ విషయం ఆదివారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. కాగా రేణుక ఒక్కతే ప్రభాకర్‌ను హతమార్చిందా లేక వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలసి ఈఘాతుకానికి ఒడిగట్టిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు ఎస్‌ఐ ప్రణీత్‌కుమార్ తెలిపారు. రేణుక పథకం ప్రకారం ప్రభాకర్‌ను హతమార్చిందని మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ
హత్య విషయం తెలుసుకున్న సీఐ తిరుపతిరెడ్డి,ఎస్‌ఐ ప్రణీత్‌కుమార్, దేవేందర్‌రెడ్డి ఆదివారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానికులను వివరాలు అడిగితెలుసుకున్నారు. అనంతరం రేణుకను అదుపులోకి తీసుకుని విచారించగా వివరాలు వెలుగులోకి వచ్చాయి. తానే ప్రభాకర్‌ను నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిపి హత్య చేసినట్టు రేణుక విచారణలో ఒప్పుకున్నట్టు ఎస్‌ఐ ప్రణీత్‌కుమార్ తెలిపారు.