
రూ.వంద కోసం భార్యను చంపాడు
హుస్నాబాద్, న్యూస్‌లైన్: భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. వంద రూపాయల కోసం ఘర్షణ పడి భార్యకు ఉరివేసి, కిరోసిన్‌పోసి తగులబెట్టాడు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలంలో అక్కన్నపేటలో ఈ ఘటన జరిగింది. వరంగల్ జిల్లా మద్దూర్ మండలం దూళిమిట్టకు చెందిన కొండూరి శ్రీనివాస్‌కు తన మేన మరదలైన హుస్నాబాద్ మండలం అక్కన్నపేటకు చెందిన రేణుకతో ఏడేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి నాగచైతన్య (6) అనే కుమారుడు ఉన్నాడు. హైదరాబాద్‌లో ఉంటూ కూలీ పనులు చేసుకునేవారు.
నాలుగేళ్ల క్రితం రేణుక పుట్టిల్లయిన అక్కన్నపేటకు వచ్చి ఉంటున్నారు. శ్రీనివాస్ ఏ పనీ చేయకుండా భార్య కూలీ పని చేసి తీసుకొచ్చిన డబ్బులతో మద్యం తాగి, ఆమెను వేధించేవాడు. మంగళవారం రాత్రి రూ.వంద విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కుటుంబసభ్యులు ఓ గదిలో నిద్రిస్తుండగా రేణుకను వంటగదిలోకి రప్పించి కొంగుతో ఉరేశాడు. అనుమానం రాకుండా ఉండేందుకు ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. పొగలు రావడంతో చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకోగా అప్పటికే రేణుక చనిపోయి ఉంది. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తులే రేణుక అంత్యక్రియలు నిర్వహించారు.