హుస్నాబాద్ మండలం జనగామకు చెందిన అబ్బరబోయిన పోశమ్మ భర్త మొగిలి నాలుగు నెలలుగా సారాకు పూర్తిగా బానిసయ్యాడు.
హుస్నాబాద్, న్యూస్‌లైన్ : హుస్నాబాద్ మండలం జనగామకు చెందిన అబ్బరబోయిన పోశమ్మ భర్త మొగిలి నాలుగు నెలలుగా సారాకు పూర్తిగా బానిసయ్యాడు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్న కుటుంబంలో పెద్దకొడుకు, కూతురుకు పెళ్లి చేసింది. భర్తను, చిన్నకొడుకును పోషించే భారమంతా పోశవ్వదే.
ఆమె కూలీ పని చేసి సంపాదించిందంతా భర్త తాగుడుకే తగలేసేవాడు. ఎన్నిసార్లు చెప్పిచూసినా అతడిలో మార్పు రాలేదు. భర్త తీరుతో ఆమె విసిగి వేసారింది. కన్నీళ్లను దిగమింగుకుంటూ కాలం గడిపేకన్నా ఎదురొడ్డి పోరాడడమే మేలని భావించింది. ఈ కష్టాలన్నింటికీ ఊళ్లో సారా అమ్మకాలే కారణమని భావించింది. సారానే లేకపోతే అందరి కుటుంబాలు బాగుపడతాయని తలచింది. తాను ఒక్కతే పోరాడితే కష్టమని భావించిన పోవమ్మ మద్యంతో కలుగుతున్న అనర్థాలను ఊళ్లో మహిళలకు వివరించింది. మెల్లగా ఒక్కొక్కరి మద్దతు కూడగట్టింది. క్రమంగా ఊరి ప్రజలంతా ఏకమయ్యారు. పోశమ్మ పడుతున్న కష్టాలు మరెవరికీ రావొద్దనుకున్నారు.
సర్పంచ్ బొడ్డు ఈశ్వర్ నేతృత్వంలో యువకులు, అధికారులు సైతం వీరికి మద్దతుగా నిలిచారు. సోమవారం గ్రామంలో మద్యం అమ్ముతున్న ఏడు బెల్ట్‌షాపులతోపాటు గుడుంబా అమ్ముతున్న ఎనిమిది కేంద్రాలను మూసివేయించారు. గ్రామంలో మద్యం, గుడుంబా విక్రయిస్తే ఊరుకునేది లేని హెచ్చరించారు. మద్యానికి దూరంగా ఉంటామంటూ ప్రతిజ్ఞ చేయించారు. పోశమ్మ కష్టాలు ఊరిని ఏకం చేసి మద్యం అమ్మకాలను నిలిపివేయించాయి. ఇప్పుడు కావలసిందల్లా ఆమెకు అధికారులు అండగా నిలవడమే. విచ్చలవిడి మద్యం అమ్మకాలను నియంత్రించడమే.