సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజల మనోభావాలను ఆంటోనీ కమిటీకి ప్రత్యేకంగా నివేదించాలని గ్రేటర్ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. దీనిపై రూపొందించిన రహస్య నివేదికను కమిటీకి అందజే సేందుకు వారు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆంటోనీ కమిటీతో భేటీకి అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరుతూ గ్రేటర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మంత్రి దానం నాగేందర్ శుక్రవారం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిశారు.
ఈ నెల 19, 20 తేదీల్లో ఆంటోనీ కమిటీ తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు, అభ్యంతరాలను వినేందుకు సిద్ధమైన నేపథ్యంలో బొత్స తెలంగాణ మంత్రులకు ఈ సమాచారం అందించారు. ఆ మేరకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు శుక్రవారం గాంధీభవన్‌కు వచ్చి బొత్సను కలిశారు. తెలంగాణ ప్రజాప్రతినిధులంతా ఐక్యంగా ఢిల్లీ వెళ్లి ఆంటోనీ కమిటీని కలుస్తామని, 19న అపాయింట్‌మెంట్ ఖరారు చేయాలని కోరారు. అప్పటికే అక్కడికి వచ్చిన దానం నాగేందర్ మాత్రం వారితో విభేదించారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు అనేక అనుమానాలు, ఆందోళనలు ఉన్నందున తాము ఆంటోనీ కమిటీని ప్రత్యేకంగా కలుస్తామన్నారు. ఈ మేరకు తమకు అపాయింట్‌మెంట్ కావాలని బొత్సను కోరారు. ఆంటోనీ కమిటీతో మాట్లాడిన తరువాత అపాయింట్‌మెంట్ ఖరారు చేస్తానని బొత్స బదులిచ్చినట్లు తెలిసింది. సమావేశానంతరం దానం మీడియాతో మాట్లాడుతూ ఆంటోనీ కమిటీని ప్రత్యేకంగా కలవనున్న విషయం చెప్పారు.
యథాతథంగా అమలు చేయాల్సిందే: టీ మంత్రులు
పీసీసీ చీఫ్ బొత్సతో సమావేశమైన అనంతరం తెలంగాణ మంత్రులతో కలిసి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన విషయంలో సీడబ్ల్యూసీ, యూపీఏ చేసిన తీర్మానాన్ని యథాతథంగా అమలు చేయాలని ఆంటోనీ కమిటీని కోరతామన్నారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాష్ర్ట విభజన విషయంలో భవిష్యత్ తెలంగాణ నిర్మాణానికి అవసరమైన సాయం కూడా అందించాలని విజ్ఞప్తి చేస్తామన్నారు. అందులో భాగంగా ఈ నెల 18న మంత్రుల నివాస ప్రాంగణంలో ఈ ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్నందుకు సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెడతామని చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్ మంత్రులు, ప్రజాప్రతినిధులను కూడా ఈ భేటీకి ఆహ్వానిస్తామని, ఈ విషయంలో వారిని ఒప్పిస్తామని జానా, శ్రీధర్‌బాబు ధీమా వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విభజనపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం తమకు దైవ శాసనమని, మనసా వాచా అమలు చేయిస్తామని చెప్పారు. విభజన విషయంలో అందరికీ సమన్యాయం చేయాలని ఈనెల 19న వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆమరణ దీక్ష చేయాలని తలపెట్టడాన్ని పొన్నం తప్పుపట్టారు. అందరికీ సమన్యాయమంటే ఏమిటో వివరించాలని డిమాండ్ చేశారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఒకవైపు హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే మరోవైపు సీమాంధ్ర ఎంపీలతో రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని పార్లమెంటులో నినాదాలు చేయిస్తూ సభను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు.
ఆంటోనీ కమిటీని ప్రత్యేకంగా కలుద్దాం!
Published Sat, Aug 17 2013 2:35 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement