హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రత.. కేంద్రం చేతుల్లోనే!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో నివసించే సీమాంధ్రుల భద్రతపై విభజన బిల్లు ముసాయిదాలో సరైన స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణ మంత్రిమండలి నుంచి తీసుకున్న సూచనల మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. ఇందుకవసరమైన సూచనలు, సలహాల కోసం కేంద్రం ఇద్దర్ని నియమిస్తుందని తెలిపారు. గవర్నర్ నిర్ణయం తీసుకుంటారనడం, కేంద్రం ఇద్దరు సలహాదారులను నియమించనుండటం వల్ల.. సీమాంధ్రుల భద్రత కేంద్రం చేతుల్లోనే ఉండేలా బిల్లు రూపొందించినట్లైంది.
అయితే సీమాంధ్రుల భద్రతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే విషయంలో సీమాంధ్ర ప్రజాప్రతినిధుల పాత్ర ఏమాత్రం లేదు. దీంతో పాటు తెలంగాణ మంత్రుల సూచనల మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని పేర్కొనడంపై కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకూ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించడంతోపాటు భద్రతా వ్యవహారాన్ని గవర్నర్‌కు అప్పగించే విధంగా బిల్లులో పేర్కొన్నారు.
ఉమ్మడి గవర్నర్, ఉమ్మడి రాజధానిలో ప్రజల భద్రతకు సంబంధించి బిల్లులో ఏముందంటే.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రాంతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకూ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. రెండు రాష్ట్రాలకూ కలిపి ఒకే గవర్నర్ ఉంటారు. ఉమ్మడి రాజధానిలో నివసించే ప్రజల జీవనం, స్వేచ్ఛ, ఆస్తులకు రక్షణ కల్పించడం గవర్నర్ ప్రత్యేక బాధ్యత. శాంతిభద్రతలు, అంతర్గత భద్రతకు కూడా గవర్నర్ ప్రత్యేక చర్యలు తీసుకోవలసి ఉంటుంది.
ఉమ్మడి రాజధానిలో ప్రభుత్వ భవనాల కేటాయింపు అధికారం కూడా గవర్నర్‌కే ఉంటుంది. గవర్నర్‌కు ఈ అధికారాలు ఉమ్మడి రాజధానిగా ఉన్న పదేళ్లు మాత్రమే వర్తిస్తాయి. వాస్తవానికి బిల్లులో ఉమ్మడి రాజధానిలో నివసించే సీమాంధ్రుల భద్రత అన్న ప్రస్తావనే లేదు. ఉమ్మడి రాజధానిలో నివసించే ప్రజలందరి భద్రత అని మాత్రమే పేర్కొన్నారు. ఉమ్మడి రాజధానిలో నివసించే సీమాంధ్రుల భద్రత కోసం ప్రత్యేక చట్టం, వారి భద్రత కోసం ప్రత్యేక చర్యలకు సంబంధించి బిల్లులో ఎలాంటి ప్రస్తావన లేదు. తద్వారా ఉమ్మడి రాజధానిలో సీమాంధ్రుల భద్రత కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం చేసేదేమీలేదని స్పష్టం చేసినట్లైంది.
గవర్నర్ ఆధీనంలోనే పోలీస్ కమిషనరేట్
ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు, అంతర్గత భద్రత పూర్తిగా గవర్నర్ ఆధీనంలోనే ఉండాలని నిర్ణయించడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కూడా గవర్నర్ ఆధీనంలోనే ఉండనుంది. పోలీస్ కమిషనర్ నియామకం, బదిలీల వ్యవహారం కూడా గవర్నరే పర్యవేక్షించనున్నారు.
తెలంగాణ మంత్రిమండలి సూచనలను గవర్నర్ తీసుకోవలసి ఉండటంతో పోలీసు నియామక, బదిలీల విషయంలో ఆ రాష్ట్ర ప్రజాప్రతినిధులకు కొంత అధికారం ఉండే అవకాశం ఉంటుంది. అయితే పోలీసు సిబ్బంది రెండు ప్రాంతాలకు చెందినవారు ఉండే అవకాశం లేనేలేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఆరో జోన్‌లో భాగంగానే నియామకాలు జరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్‌లో పనిచేసే నాన్‌లోకల్ కోటావారు మినహా అందరూ ఇక్కడివారే ఉంటారు.