
హైదరాబాద్ తెలంగాణ సొత్తే
కందుకూరు/ మహేశ్వరం, న్యూస్‌లైన్: హైదరాబాద్ తెలంగాణ ప్రజల సొత్తేనని కేంద్ర సాంకేతిక శాఖ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు, మహేశ్వరం మండలాల్లో ఆదివారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్నట్టుగా ‘తెలంగాణ అంటే పది జిల్లాల ప్రాంతం కాదోయ్.. తెలంగాణ అంటే నాలుగున్నర కోట్ల ప్రజల సొత్తోయ్’ అంటూ కవిత రూపంలో చెప్పారు. హైదరాబాద్‌ను ఎవరూ అభివృద్ధి చేయలేదని.. అది నైజాం కాలం నుంచే గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుందని పేర్కొన్నారు.
ఐటీఐఆర్ రాకతో ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో దూసుకుపోనుందని చెప్పారు. గతంలో ఈ ప్రాంతంలో తిరగాలంటేనే జంకేదని, ప్రస్తుతం సోనియా దయతో తలెత్తుకు తిరుగుతున్నామని తెలిపారు. రాబోయే తెలంగాణ రాష్ట్రం స్వర్ణయుగంలా ఉంటుందని జైపాల్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. దేశం ఆర్ధిక, సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెంది.. 90 కోట్ల మంది ప్రజలు మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నా, కనీసం 9 కోట్ల మరుగుదొడ్లు నిర్మించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల ఆత్మాభిమానం కోసం ప్రతి ఇంట్లో తప్పనిసరిగా మరుగుదొడ్డి నిర్మించుకునేలా స్ఫూర్తితో ముందుకుసాగాలని కోరారు. ఈ సభలో మాజీ మంత్రి సబితారెడ్డి పాల్గొన్నారు.