సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డికి మాతృవియోగం కలిగింది. ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మాతృమూర్తి సూదిని యశోదమ్మ(90) శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10లోని జైపాల్‌రెడ్డి నివాసంలో కన్నుమూశారు. ఆమెకు జైపాల్‌రెడ్డి, పద్మారెడ్డి, మనోహర్‌రెడ్డి అనే ముగ్గురు కొడుకులు, కుమార్తె భారతి ఉన్నారు. ఆమె స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల. యశోదమ్మ మృతితో జైపాల్‌రెడ్డి కుటుంబం విషాదంలో మునిగింది. తల్లి మరణవార్త సమాచారం తెలియగానే జైపాల్‌రెడ్డి ఢిల్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు.
తల్లి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. కాగా యశోదమ్మ తన కళ్లను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు. దీంతో వైద్యులు ఆమె కళ్లను సేకరించారు. యశోదమ్మ భౌతికకాయానికి శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈఎస్‌ఐలోని హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.