పోలీసు దూకుడుకు టీడీపీ కళ్లెం | Hyderabad police Monday rally | Sakshi
Sakshi News home page

పోలీసు దూకుడుకు టీడీపీ కళ్లెం

Published Wed, Jun 18 2014 2:58 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

పోలీసు దూకుడుకు టీడీపీ కళ్లెం - Sakshi

పోలీసు దూకుడుకు టీడీపీ కళ్లెం

తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో మరో బడా స్మగ్లర్ !
నెల్లూరు పోలీసులకు చిక్కిన ఇంకో ముగ్గురు స్మగ్లర్లు
మిగిలిన వారికోసం ‘సీమ’ పోలీసుల వేట
‘ఎర్రదొంగల’ను అరెస్టు చేయొద్దని
హుకుం జారీ చేస్తున్న ఇద్దరు టీడీపీ ముఖ్య నేతలు

 
ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బడా స్మగ్లర్ల అరెస్టుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.   అయితే పోలీసుల దూకుడుకు చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు చెందిన ఇద్దరు టీడీపీ కీలకనేతలు మోకాలడ్డుతున్నారు. తమ పార్టీకి చెందిన వారిని అరెస్టు చేయొద్దని పోలీసులకు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో పోలీసులు డోలాయమానంలో పడ్డారు.
 సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసేందుకు రా యలసీమ డీఐజీ బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతోంది. తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులతోపాటు రా యలసీమ, నెల్లూరు, తమిళనాడు, కర్ణాటక పోలీసులు ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. 20 రోజులుగా సాగుతున్న ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ఎనిమిదిమంది దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆదివారం శ్రీపొట్టి శ్రీరాములునెల్లూరు జిల్లాకు చెందిన మురళీమోహన్ అనే బడా స్మగ్లర్‌ను తిరుపతి టా స్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇతను నెల్లూరు ఎస్పీ పరిధిలో ఉన్నట్టు తెలిసింది. వీరితో పాటు అదే జిల్లాకు చెందిన మరో ముగ్గురు స్మగ్లర్లను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వీరిలో ఓ ప్రముఖ న్యాయవాది కూడా ఉన్నట్టు సమాచారం. దీంతో పోలీసుల అదుపులో ఉన్న స్మగ్లర్ల సంఖ్య 12కు చేరింది.

‘ఎర్ర’ దొంగలకు ‘పచ్చ’ నేతల దన్ను

 ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారి సంఖ్యను పోలీసులు ప్రాంతాల వారీగా సిద్ధం చేశారు. పక్కా ప్రణాళికతో వారిని అరెస్టు చేసేందుకు 20 రోజులుగా శ్రమిస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా టీడీపీ నేతల నుంచి పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నట్టు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. ఎర్రచందనం స్మగ్లర్లు అండకోసం అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎంపీ సీఎం.రమేశ్‌ను సంప్రదిస్తున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల కోసం భారీగా ఖర్చు పెట్టామని, ఇప్పుడు పార్టీ తమకు అండగా నిలిచి అరెస్టు నుంచి తప్పించాలని చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు స్మగ్లర్లు వారి ఎమ్మెల్యేల ద్వారా ఈ ఇద్దరినీ సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో వీరు కూడా పోలీసుల జాబితాలో ఉన్న దొంగల్లో టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులు ఎవరనేది వివరాలు సేకరించి, వారిజోలికి వెళ్లొద్దని పోలీసులపై ఒత్తిడి తె స్తున్నట్టు సమాచారం. టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఒత్తిడి అధికంగా ఉంది. దీంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అరెస్టుల పర్వానికి ఆటంకం ఏర్పడినట్టయింది.

సహకరించని తమిళనాడు, కర్ణాటక పోలీసులు

 అరెస్టుల జాబితాలోని 196 మంది ఎర్రచందనం స్మగ్లర్లలో కర్ణాటక, తమిళనాడుకు చెందినవారు 42 మంది ఉన్నారు. వీరిలో ఒక్కరిని కూడా ఆ రాష్ట్ర పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలకు చెందిన వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఇక్కడి దొంగల కంటే ఆ రాష్ట్రాల్లోని 42 మందిలోనే కీలక దొంగలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎర్రచందనం పోర్టుకు చేర్చి అక్కడి నుంచి విదేశాలకు తరలించే ‘సిసలైన దొంగలు’ ఆ రెండు రాష్ట్రాల్లోనే ఉన్నారు. అక్కడి పోలీసుల సహకారం ఆశించినంత లేకపోవడంతో రాయలసీమ పోలీసులు నిరుత్సాహ పడుతున్నారు. వారిలో కొందరిని అరెస్టు చేసినా కీలక వివరాలు అందే అవకాశం ఉందని ఇక్కడి పోలీ సులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement