
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హైపర్‌లూప్ రైలును అమరావతి–విజయవాడ మధ్య నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు హైపర్ లూప్ ట్రాన్స్‌పోర్టు టెక్నాలజీస్ (హెచ్‌టీటీ) చైర్మన్ బిబోప్ గ్రెస్టా వెల్లడించారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) భాగస్వామ్య సదస్సులో పాల్గొనడానికి వచ్చిన బిబో ‘సాక్షి’తో మాట్లాడారు. ‘అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో 2013లో నిర్మించిన హైపర్ లూప్ విజయవంతంగా నడుస్తోంది.
ప్రస్తుతం భారతదేశంలో ఈ రవాణా వ్యవస్థ సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, గోవా రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నాం. 2017 సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో హైపర్ లూప్ ఒప్పందం కుదుర్చుకుంది. భూసామర్థ్య పరీక్షలు, ఇతర సాంకేతిక పరీక్షల్లో ఈ ప్రాంతం ఈ ప్రాజెక్టుకు అనువైనదిగా తేలింది. దీంతో రెండు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నాం. ’అని బిబోప్ గ్రెస్టా వివరించారు.