
'మంత్రి పదవి కావాలని బాబును అడగలేదు'
తానెప్పుడూ మంత్రి పదవి ఆశించలేదని చెప్పారు. ఇప్పించండని చంద్రబాబును అడగలేదని, భవిష్యత్తులో కూడా అడగబోనని జేసీ పేర్కొన్నారు.
గుత్తి: ‘కాంగ్రెస్ హయాంలో కూడా పేదలకు ఉచితంగా పండుగ సరుకులను అందజేశాము. అయితే అప్పుడు ఇంతగా ప్రచారం చేసుకోలేదు. ఇప్పుడు మాత్రం చంద్రన్న కానుక సరుకులపై విపరీతమైన ప్రచారం జరుగుతోంది..’ అని అనంతపురం లోక్‌సభ సభ్యుడు జేసీ దివాకరరెడ్డి అన్నారు.
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే జితేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో ‘చంద్రన్న కానుక’పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సరుకుల గురించి ఇప్పుడింతగా ప్రచారం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తానెప్పుడూ మంత్రి పదవి ఆశించలేదని చెప్పారు. ఇప్పించండని చంద్రబాబును అడగలేదని, భవిష్యత్తులో కూడా అడగబోనని పేర్కొన్నారు. చంద్రబాబుతో మాట్లాడే ధైర్యం తనకు తప్ప మరెవరికీ లేదన్నారు.
‘రాష్ట్రంలో ఖజానా దివాళా తీసింది. రాష్ట్రం విడిపోయాక ఆర్థిక ఇక్కట్లు ఎక్కువయ్యాయి. రాజకీయ పరిస్థితుల కారణంగానే చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చారు. అయితే.. వాటిని దశల వారీగా అమలు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం చంద్రబాబును కలిసి పింఛన్ మొత్తాన్ని రూ.వెయ్యికి ఎందుకు పెంచావని అడిగా. పింఛన్ రాలేదని చాలామంది మథనపడుతున్న విషయాన్నీ చెప్పా. రూ.500కు పెంచి ఉంటే అందరికీ ఇచ్చే అవకాశం ఉండేది..’ అని పేర్కొన్నారు. తన ప్రసంగంలో జేసీ పదేపదే ‘మా కాంగ్రెస్ పార్టీ’ అనడంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు.