
భ్రమలు వీడితేనే భవిత
‘కాంగ్రెస్ పార్టీని ముఖ్య నేతలే రాష్ట్రంలో భ్రష్టుపట్టించారు. ప్రధానంగా పలువురు కీలక నేతలు సుదీర్ఘకాలంగా పదవులు అనుభవించి కీలక సమయంలో పార్టీని వదిలేసి వెళ్లిపోయారు.
కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో నేతలు
జంప్ జిలానీలను క్షమించవద్దు
విభజన వల్లే పార్టీకి రాష్ట్రంలో తీవ్ర నష్టం
ఉద్వేగంగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు
7 గంటల పాటు సుదీర్ఘ సమీక్ష
విజయవాడ :
‘‘కాంగ్రెస్ పార్టీని ముఖ్య నేతలే రాష్ట్రంలో భ్రష్టుపట్టించారు. ప్రధానంగా పలువురు కీలక నేతలు సుదీర్ఘకాలంగా పదవులు అనుభవించి కీలక సమయంలో పార్టీని వదిలేసి వెళ్లిపోయారు. పార్టీ జెండాను ఏళ్లతరబడి మోస్తున్న కార్యకర్తలకు సరైన ప్రాధాన్యమివ్వలేదు, న్యాయం కూడా జరగలేదు. ఇకనైనా ముఖ్యులు భ్రమలు వీడితేనే రాష్ట్రంలో పార్టీ బతుకుతుంది. లేదంటే భవిష్యత్తు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి’’ ఇదీ 13 జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సమావేశంలో పలువురు జిల్లా నేతలు తీవ్ర అగ్రహావేశాలతో ముఖ్యులను ప్రశ్నించిన తీరు. కేంద్ర మాజీ మంత్రులు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, రాష్ట్రంలో మాజీ ముఖ్య నేతలు రాయపాటి, లగడపాటి, కావూరి, దగ్గుబాటిల తీరుపై పలు జిల్లాల అధ్యక్షులు, ముఖ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో మంగళవారం జరిగిన సీమాంధ్ర కాంగ్రెస్ జిల్లాల అధ్యక్షుల సమావేశం వాడీవేడి ప్రసంగాల మధ్య సుదీర్ఘంగా సాగింది. నగరంలోని స్థానిక పరిణయ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. దాదాపు ఏడుగంటలపాటు సాగిన సమావేశంలో 13 జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ ముఖ్యులు పలువురు ప్రసంగించారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మాజీ మంత్రులు కిల్లి కృపారాణి, పల్లంరాజు, జేడీ శీలం, సుబ్బిరామిరెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర ముఖ్య నేత కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్య వరప్రపాద్, కాసు కృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, వట్టి వసంత్ కుమార్, కొండ్రు మురళీ, మహ్మద్ జానీ, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు సమావేశంలో పాల్గొన్నారు. తొలుత రఘవీరారెడ్డి అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకొని, తద్వారా పార్టీని బలోపేతం చేయటానికి సంస్థాగతంగా తీసుకోవాల్సిన చర్యల గురించి నేతలు నిర్మొహమాటంగా మాట్లాడాలని సూచించారు.
జంప్ జిలానీలను మళ్లీ తీసుకోవద్దు...
మాజీ ఎమ్మెల్యే దేవినేని నెహ్రూ మాట్లాడుతూ లగడపాటి, రాయపాటి, పురందేశ్వరి, కావూరి సాంబశివరావు లాంటి నేతలు పార్టీ ద్వారా మంచి పదవులు అనుభవించి వెళ్లిపోయారని, మళ్లీ అలాంటి జంప్ జిలానీలు వస్తే పార్టీలోకి తీసుకోకూడదని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్లను ఆదరిస్తే సహించబోమని హెచ్చరించారు. రాష్ట్ర విభజన విషయంలో జైరాం రమేష్ వ్యవహరించిన తీరు చాలా దారుణంగా ఉందన్నారు. కనీసం వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని జైరాం రమేష్‌కు పార్టీలో కేంద్ర మంత్రి పదవి ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. ఆయన చర్యల వల్లే సీమాంధ్రలో కాంగ్రెస్ ఘోరంగా నష్టపోయిందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టపోయిందన్నారు. ప్రజలు విభజన తీరు వల్ల తీవ్రంగా బాధపడ్డారని చెప్పారు. దాని పర్యవసానంగా అనేక స్థానాల్లో పార్టీకి డిపాజిట్ దక్కలేదని చెప్పారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి దేవినేని అవినాష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో యువతను బాగా ప్రోత్సహించిందని, రానున్న రోజుల్లోనూ ఇదే రీతిలో వినియోగించుకోవాలని కోరారు.
విజయవాడలోనే పీసీసీ కార్యాలయం
విజయవాడ నగరంలోనే పీసీసీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి తెలిపారు. నగరంలో పార్టీ కార్యాలయానికి అనువైన ప్రాంతాన్ని నేతలు గుర్తిస్తున్నారని, కొద్దిరోజుల్లోనే పార్టీ రాష్ట్ర కార్యకలాపాలు ఇక్కడ నుంచే జరుగుతాయని చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు, జిల్లా నేతలు ఐలాపురం వెంకయ్య, అడపా నాగేంద్రం, మీసాల రాజేశ్వరరావు, కొలనుకొండ శివాజీ, కడియాల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.