
‘ఇరాక్‌లో మేము క్షేమం’
కోరుకొండ : ఇరాక్‌లో తాము క్షేమంగా ఉన్నామంటూ అక్కడ ఉన్న జిల్లా వాసులు తమ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కోరుకొండకు చెందిన దోమ వీరబాబు శనివారం తన భార్య రామసీతకు ఫోన్ చేశాడు. దీంతో నాలుగు రోజులుగా బెంగతో ఉన్న అతడి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వీరబాబుకు భార్య రామసీత, ఇద్దరు పిల్లలు, తల్లి సీతమ్మ ఉన్నారు. ఇరాక్‌లోని పెప్సీ కంపెనీలో పనిచేయడానికి ఏడాది క్రితం వెళ్లాడు. అక్కడ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వీరబాబు క్షేమంగా ఉండడంతో ఆనందం వ్యక్తం చేశాడు. ఇరాక్‌లో తనతో ఆంధ్రప్రాంతానికి చెందిన 250 మంది ఉన్నారని, తమకు 120 కిలోమీటర్ల దూరంలో యుద్ధం జరుగుతోందని వీరబాబు ఫోన్‌లో చెప్పినట్టు రామసీత తెలిపింది.
సీతానగరం మండల వాసులు
సీతానగరం : బతుకుతెరువు కోసం ఇరాక్ దేశానికి వెళ్లిన చినకొండేపూడి, రఘుదేవపురం గ్రామస్తులు క్షేమంగా ఉన్నారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. రఘదేవపురానికి చెందిన గడుసుల గంగరాజు ఇరాక్ నుంచి శుక్రవారం రాత్రి తన తల్లి పాపాయమ్మకు ఫోన్ చేశాడు. యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి తాము 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నామని, తామున్నచోట ఎలాంటి ప్రమాదం లేదని తెలిపాడు. అలాగే చినకొండేపూడిలోని రాజుపాలేనికి చెందిన గడుసుల వెంకట్రావు, గడుసుల శ్రీను తదితరులు తమ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి క్షేమంగా ఉన్నట్టు తెలిపారు.