తరం మారినా.. అదే తీరు
Published Thu, Jan 23 2014 4:50 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
సాక్షి, ఏలూరు:ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం వస్తే జీవితం గాడిన పడినట్టే అనుకునేది యువతరం. ఇప్పుడు ఏదో ఓ ఉద్యోగం కాదు. ‘పడితే పోలీస్ ఉద్యోగమే పట్టాలి.. చేతి నిండా డబ్బు సంపాదించాలి’ అనుకుం టోంది. సొమ్ము సంపాదించుకోవడానికి అత్యధిక అవకాశాలున్న కొలువుగా పోలీస్ ఉద్యోగాన్ని చూస్తున్నారని ఆ శాఖలో కొత్తగా చేరిన వారిని చూస్తే ఇట్టే అర్థమవుతోంది. ఖాకీ దుస్తులు వేసుకుని నేరస్తుల గుండెల్లో నిద్రపోవాల్సిన వాళ్లు.. అదే నేరస్తులతో చేతులు కలి పి అన్యాయాలు, అక్రమాలు జరగుతున్నా కళ్లుమూసుకుంటున్నారు. పోలీసు వ్యవస్థలో అవినీతి పేరుకుపోయిందని, దానిని ప్రక్షాళన చేయడానికి ఎన్నో సం స్కరణలు తీసుకువస్తున్నామని ఉన్నతాధికారులు చెబుతున్న మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఉన్నత చదువులు చదివి కొత్తగా పోలీ సు శాఖలో చేరిన యువతలో కొందరు కొద్ది రోజు లకే లంచాల బాటపడుతున్నారు. అవినీతి ఆరోపణలతో పెదపాడు ఎస్సై గంగాభవాని సస్పెండై ఈ విషయూన్ని మరోసారి రుజువు చేశారు.
కొత్త కొత్తగా...
జిల్లాలోని నాలుగు సబ్ డివిజన్ల పరిధిలో 64 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఒక ఎస్పీ, ఒక ఏఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు కలిపి దాదాపు 2,800 మంది సిబ్బంది ఉన్నారు. గతేడాది దాదాపు 40మంది ఎస్సైలు, 284మంది కానిస్టేబుళ్లు కొత్తగా వచ్చారు. వారిలో కొందరు వచ్చీ రావడంతోనే అవినీతికి శ్రీకారం చుట్టారు. 2010 బ్యాచ్ కు చెందిన ఎస్సై గంగాభవాని ట్రైనీ ఎస్సైగా ఉన్నప్పటి నుంచీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. కొత్త సిబ్బందిలో కొందరు ప్రేమ పేరుతో యువతుల్ని వంచించడంలో ఆరితేరారు. సిబ్బందితో ప్రేమాయణాలు నడుపుతున్నారు. ఆ ప్రేమ పెళ్లిపీటల వరకూ వెళ్లకపోవడంతో కొద్దిరోజుల క్రితం ఓ మహిళా కాని స్టేబుల్ ఏలూరులో ఆత్మహత్యకు పాల్పడటం యువ పోలీసుల తీరు బట్టబయలు చేసింది.
సీనియర్లతో సమానంగా..
కొత్తగా విధుల్లో చేరిన వారు సీనియర్లతో సమానంగా పోలీసు వ్యవస్థ పరువు తీస్తున్నారు. మొన్న లంచం తీసుకుంటూ నిడదవోలు సీనియర్ సీఐ సాం బశివరావు ఏసీబీకి పట్టుబడ్డారు. తాజాగా అవినీతి ఆరోపణలతో జూనియర్ ఎస్సై గంగాభవాని సస్పెం డయ్యూరు. ఇలాంటి ఉదంతాలు పోలీస్ వ్యవస్థలో సర్వసాధారణమైపోయాయి. ఏలూరులో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తీర రాజు భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడనే అభియోగంతో రెండు రోజుల క్రితం కేసు నమోదైంది. నరసాపురంలో హోంగార్డుగా పనిచేస్తున్న దిగమర్తి సత్యనారాయణ తనను పెళ్లిచేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్‌లో పది రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. పోలీస్ దుస్తు లు వేసుకుంటే చాలు సులువుగా డబ్బులు సంపాదించవచ్చనే ఆలోచనకు యువకులు వస్తున్నారంటే వారిపై సీనియర్ల ప్రభావం ఎంతగా ఉందో అర్థమవుతోంది. గతంలోనూ జిల్లా పోలీసులపై అవినీతి మరకలు పడ్డాయి.
2004లో లంచం సొమ్ము పంపకాల్లో తలెత్తిన వివాదం ముదిరి పోలీసులే తోటి పోలీసుని చంపేశారు. కొందరు కటకటాల పాల య్యూరు. ఈ కేసులో కొవ్వూరు డివిజన్‌లో ఐదేళ్ల కాలంలో పనిచేసిన డీఎస్పీలు, ఎస్సైలకు చారి ్జమెమోలు జారీ అయ్యాయి. నేరస్తుల్ని పట్టుకోవడంలోనూ నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. రాజకీయ వత్తిళ్లతో కేసుల్ని తారుమారు చేస్తున్నారు. అక్రమ కేసు లు బనాయిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో ఇలాంటి పనిచేసిన ఓ అధికారి సీఐడీ విచారణలో దొరికిపోయాడు. జరిమానా రసీదులను అక్రమంగా ముద్రిం చి కొవ్వూరు డివిజన్‌లో ఓ ఏఎస్సై సస్పెండయ్యాడు. చివరకు వ్యభిచారుల నుంచి ఏటీఎం కార్డులు లాక్కొని సొమ్ము కాజేసిన ఘనులు సైతం జిల్లాలో ఉన్నారు. సామాన్యులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాలన్నా.. వారితో మాట్లాడాలన్నా నేటికీ భయపడుతున్నారంటే కొత్తగా వస్తున్న వాళ్లు సైతం ప్రజ లకు సేవ చేస్తామనే నమ్మకం కల్పించలేకపోవడం, వారని దోచుకోవడమే కారణంగా కనిపిస్తోంది.
Advertisement
Advertisement