కర్నూలు (అగ్రికల్చర్) : ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి పెరిగిందని, అయినప్పటికీ అప్పగించిన పనులను జవాబుదారీతనంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిహెచ్.విజయమోహన్ తెలిపారు. సోమవారం ఉదయం కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా అధికారులనుద్దేశించి మాట్లాడుతూ.. ‘మీ సంగతేమో కాని ప్రస్తుత పరిస్థితుల్లో నేను కూడా ఒత్తిడికి గురవుతున్నా’నని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాలను తూచ నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
జిల్లాలోని 898 గ్రామ పంచాయతీలు, అర్బన్ ప్రాంతాల్లోని అన్ని వార్డులను అన్ని విధాలా అభివృద్ధి చేసి స్మార్ట్ విలేజి, వార్డుగా అభివృద్ధి చేయడానికి దాతల సహకారం తీసుకోవాలని సూచించారు. జిల్లాలో కార్పొరేట్ సంస్థల వివరాలను అందజేయాలని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సుందర్‌రావును ఆదేశించారు. మైనింగ్‌కు సంబంధించిన పరిశ్రమల వివరాలు ఇవ్వాలని గనుల శాఖ ఏడీని ఆదేశించారు. కార్పొరేట్ సంస్థలు, మైనింగ్ ఇండస్ట్రీస్, స్వచ్ఛంద సంస్థలు, ఇతర దాతల ద్వారా అన్ని గ్రామాలు, వార్డులను స్మార్ట్‌గా అభివృద్ధి చేయడానికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలన్నారు.
మండలాల నోడల్ అధికారులు తమ పరిధిలోని కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలతో చర్చించాలని తెలిపారు. ప్రభుత్వ కృషికి దాతలు కూడా సహకరిస్తే లక్ష్యాలను తేలికగా సాధించవచ్చన్నారు. జిల్లాలో మార్చి నెల చివరి నాటికి లక్ష వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలనేది లక్ష్యమని ఇందుకు నోడల్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన 20 అంశాల్లో గ్రామాలను అభివృద్ధి చేయడానికి దోహదపడాలన్నారు. మంగళ, బుధ, గురువారాల్లో జిల్లా అధికారులు గ్రామాలకు వెళ్లాలని శుక్ర, శనివారాల్లో స్మార్ట విలేజి, వార్డు ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై సమీక్షలు ఉంటాయని తెలిపారు. సమావేశంలో జేసీ సి.హరికిరణ్, ఏజేసీ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
నేనూ ఒత్తిడికి గురవుతున్నా
Published Tue, Jan 20 2015 2:55 AM | Last Updated on Thu, Mar 21 2019 8:23 PM
Advertisement
Advertisement