మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి కలెక్టర్ జానకి
నెల్లూరు(పొగతోట) : గ్రామీణ ప్రాంతాల్లో నూరు శాతం మేర వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేసి మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ జానకి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కస్తూర్బా కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన ఆత్మగౌరవ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు. స్వచ్ఛభారత్‌లో స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు భాగస్వాములు కావాలని కోరారు. గ్రామాల్లో బహిరంగ మూత్రవిసర్జన లేని విధంగా ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలో 7.7 లక్షల కుటుంబాలు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 5.6 లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయని, వీరిలో 35 శాతం మందికే మరుగుదొడ్లు ఉన్నాయని వివరించారు.
ఒక్కో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.15 వేలను మంజూరు చేస్తారని పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ మండలం పెనుబర్తిలో మహిళలు ముందుకొచ్చి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేశారని చెప్పారు. బహిరంగ మలవిసర్జన లేని ఆదర్శ గ్రామంగా పునుబర్తి రూపుదిద్దుకొందని తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై జేసీ - 2 రాజ్‌కుమార్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. బహిరంగ మలవిసర్జన వల్ల వచ్చే వ్యాధులు, నష్టాలు, సమస్యలపై ఢిల్లీ ఫౌండర్ వీరేందర్ వీడియోను ప్రదర్శించారు. పెనుబర్తిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో కృషి చేసిన సర్పంచ్ శారదమ్మ, ఉపసర్పంచ్ వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు రామ్‌ప్రసాద్, జన్మభూమి కమిటీ సభ్యులు శ్రీనివాసులురెడ్డిని కలెక్టర్ సన్మానించారు. జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ రామిరెడ్డి, గూడూరు సబ్ కలెక్టర్ గిరీషా, డ్వామా పీడీ హరిత, డీపీఓ సెల్వి, హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ డెరైక్టర్ నిర్మలమ్మ, నెల్లూరు, ఆత్మకూరు, నాయుడుపేట ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రమణ, బాబయ్య, తదితరులు పాల్గొన్నారు.