గట్లకానిపర్తిలో స్వచ్ఛభారత్ ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్
శాయంపేట(భూపాలపల్లి): ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకోండి..నెల రోజుల్లో మీ బిల్లులు ప్రభుత్వం ఇవ్వకపోతే నా సొంత డబ్బులు ఇస్తా...పాత బిల్లులకు లింకులు పెట్టకుండా మరుగు దొడ్లు వంద శాతం నిర్మించుకుని వాడితేనే చెల్తిసా..ఒకవేళ డబ్బులివ్వకపోతేనా ఆఫీసు ముందు కూర్చోండి..ఇవ్వకపోతే అక్కడి నుంచి వెళ్లకండి.. అది కూడా నెల రోజుల్లో పూర్తి చేయాలి. అంతేకాదు అనుకున్న సమయానికి పూర్తి చేస్తే నా నిధుల నుంచి రూ.5 లక్షలు అభివృద్ధికి కేటాయిస్తానని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ అన్నారు.
మండలంలోని గోవిందాపూర్, గట్లకానిపర్తి గ్రామాల్లో మరుగుదొడ్లపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మంగళవారం కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ముందుగా గట్లకానిపర్తిలో మరుగుదొడ్ల నిర్మాణం, వాడకం, పారిశుద్ధ్యంపై ప్రజలతోపాటు అధికారులు, కలెక్టర్ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం స్వచ్ఛభారత్‌పై అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మరుగుదొడ్డి అనేది ప్రభుత్వ వ్యక్తిగత ఆస్తి అన్నారు. ప్రజాప్రతినిధులు ఎక్కడైతే పనిచేస్తారో అక్కడే వంద శాతం ఓడీఎఫ్ సాధించగలుగుతున్నామన్నారు. ఏ గ్రామంలోనైతే ప్రజాప్రతినిధుల సహకారం అందదో అక్కడ మరుగుదొడ్ల నిర్మాణం సాధ్యంకాదని పేర్కొన్నారు. డిసెంబర్ 15 నాటికి వంద శాతం ఓడీఓఫ్ గ్రామాలుగా చేయాలని కోరారు.
ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దాలి..
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో అవగాహన కల్పించాలని సూచించారు. డిసెంబర్‌లోగా మండలాన్ని ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. జిల్లాలోనే శాయంపేట మరుగుదొడ్ల నిర్మాణంలో వెనుకబడి ఉందని తెలిపారు. ప్రతి గ్రామంలో శ్మశానవాటికల కోసం రూ.10 నుంచి 12 లక్షల ప్రభుత్వం మంజూరు చేస్తోందని తెలిపారు. దాతలు గ్రామాల్లో ముందుకు వచ్చి 20 నుంచి 30 గుంటల స్థలాన్ని దానం చేస్తే ప్రభుత్వం శ్మశానవాటికను నిర్మిస్తుందని వివరించారు.
క్రమబద్ధీకరణకు మరో అవకాశం..
సాదాబైనామా కింద దరఖాస్తు చేసుకోని రైతులకు ప్రభుత్వం మరోసారి భూముల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించిందని తెలిపారు. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో చేపట్టిన భూప్రక్షాళనలో రైతులు మళ్లీ సాదాబైనామాకు ధరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం నుంచి ఎకరాకు రూ.4వేల పెట్టుబడి ఖర్చులను అందుకునే విధంగా చూడాలన్నారు. క్లియర్‌గా ఉన్న భూములకే ప్రభుత్వ పెట్టుబడి వస్తుందని స్పష్టం చేశారు. కాగా గోవిందాపూర్ వీఆర్వో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
మొక్కలను కాపాడుకోవాలి..
హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను మనమే కాపాడుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రతి శుక్రవారం జిల్లా వ్యాప్తంగా గ్రీన్‌డేను నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ హరిప్రసాద్, ఎంపీపీ రమాదేవి, సర్పంచ్‌లు చింతనిప్పుల భద్రయ్య, వైనాల విజయ, ఇమ్మడిశెట్టి రవీందర్, ఎంపీటీసీ సభ్యులు బొమ్మకంటి సుజాత, ఎంపీడీఓ రమాదేవి, తహసీల్దార్ వెంకటభాస్కర్, ఆర్‌ఐ హేమానాయక్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ శ్రీలత, వీఆర్వోలు రఘు, శివప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment