మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేక డ్రైవ్
- వారంలోపు 1.55 లక్షల నిర్మాణాలు పూర్తి చేయాలి
– ప్రతిరోజూ 21,700 నిర్మించాలి
– అధికారులకు కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశం
అనంతపురం అర్బన్: జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులను కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. వారంలోపు 1,55,834 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికావాలన్నారు. ప్రతి రోజూ 21,700 నిర్మించాలన్నారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా సంబంధిత అ«ధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం మరుగుదొడ్ల నిర్మాణంపై ఆయన కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఆర్‌డబ్ల్యూఎస్, డ్వామా, డీఆర్‌డీఏ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పక్కా ప్రణాళిక రూపొందించి మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
తహసీల్దార్లు, ఎంపీడీఓ, ఈఓఆర్డీ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు, ఏపీఓ, ఏపీఎం, ఏఈఓలను భాగస్వాములను చేయాలన్నారు. ఒక్కో అధికారికి రెండు లేదా మూడు గ్రామ పంచాయతీలను అప్పగించాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారని, పూర్తి బాధ్యత వీరిపైనే ఉంటుందన్నారు. ఈనెల 8న ప్రతి పంచాయతీలో లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ఆవశ్యకతను తెలియజేయాలన్నారు. 9న నిర్మాణానికి అవసరైన ఇటుకులు, సిమెంట్, ఇసుక, తదితర సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని, 10వతేదీ నుంచి పనులు ప్రారంభించాలన్నారు. రోజూ 21,700 నిర్మాణాలు పూర్తవ్వాలన్నారు. వీటి పురోగతిపై ప్రతి రోజూ టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తానన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈలు, డీఈలు కూడా తమ పరిధిలో రెండు లేదా మూడు పంచాయతీల బాధ్యత తీసుకొని నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. పూర్తయిన వాటిని జియోట్యాగింగ్ చేసి, అప్‌లోడ్ చేయాలన్నారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ హరేరాంనాయక్, డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు వెంకటేశ్వర్లు, నాగభూషణం, జెడ్పీ సీఈఓ సూర్యానారాయణ, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.