♦ కానరాని చినుకు-తీవ్ర వర్షాభావ పరిస్థితులు
♦ కేంద్ర బృందం పర్యటించినా...అందని సాయం
♦ ప్రభుత్వాలు ఆదుకోవాలంటున్న అన్నదాతలు
రుతుపవనాల రాకతో సందడి చేసిన చినుకమ్మ తర్వాత ముఖం చాటేసింది. నారుమళ్లు ఒకవైపు, నీటి వనరులు మరోవైపు ఎండిపోతున్నాయి. వ్యవసాయమే జీవనాధా రమైన జిల్లాలో కరువు కమ్ముకొస్తోంది. వరుణుడు కరుణిం చక పోవడంతో పంటలు నిలువునా ఎండిపోతుండడంతో రైతన్న మోములో చిరునవ్వు చెరిగిపోయింది. రికార్డు స్థాయిలో లోటు వర్షపాతం నమోదు కావడం వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఐదేళ్లుగా జిల్లాలో కరువు నృత్యం చేస్తోంది. కరువు మండలాల్లో కేంద్ర బృందం పర్యటించినా సాయం అందక పోవవడంతో అన్నదాతలు అప్పుల ఊబిలోకి కూరుకుపోయారు. మొదట్లో మురిపించిన వర్షాలు..కీలక సమయంలో ముఖం చాటేయడంతో అన్నదాతను ఆందోళనకు గురిచేస్తోంది.
నెల్లూరు(అగ్రికల్చర్) : జిల్లాలో నాలుగేళ్లుగా వర్షాభావం వెంటాడుతుండడంతో ఖరీఫ్ కలిసిరావడం లేదు. జూన్‌లో మొదలయ్యే నైరుతి రుతుపవనాల పలకరింపుతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ సీజన్‌లో 331 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సిండగా 44 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ప్రతి ఏటా ఖరీప్‌లో 2.5 లక్షల ఎకరాలకుపైగా వివిధ పంటలను సాగు చేస్తారు. ఇందులో పెన్నా డెల్టా కింద 1.75 లక్షల ఎకరాల వరకు వరి సాగు అవుతోంది. మరో 75వేల ఎకరాలు మెట్ట ప్రాంతంలో వివిధ రకాల పంటలు పెడతారు. గత ఖరీఫ్‌లో అనుకున్నంత వర్షపాతం నమోదు కాకపోవడంతో 1.5లక్షల ఎకరాలలో మాత్రమే రైతన్నలు పంటలు పెట్టారు.
తీరా వరుణుడు రిక్తహస్తం చూపడంతో 50 శాతంపైగా పంటలు ఎండిపోయాయి. వర్షపాతం, పంటల విస్తీర్ణం, దిగుబడులు ప్రమాణికంగా తీసుకున్న అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం కొండాపురం, వరికుంటపాడు, దుత్తలూరు, ఉదయగిరి, రాపూరు, సైదాపురం మండలాను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. రబీలోనూ ఇవే పరిస్థితులు పునరావృతం కావడంతో చిల్లకూరు, సీతారాంపురం, కావలి, ఏఎస్‌పేట మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని ప్రభుత్వానికి నివేదికలు పంపారు.
ఈ ఏడాది ఖరీఫ్‌లోనూ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నొలకొన్నాయి. సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. 87,136 హెక్టార్లలో వివిధ పంటలు సాగవతాయని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా వేశారు. ఇప్పటి వరకు 33,370 హెక్టార్లలో వివిధ పంటలు సాగులోకి వచ్చినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ప్రధాన జలవనరులైన కండలేరు, సోమశిల జలాశయంలో చుక్కనీరు లేదు. సర్వేపల్లి, కనిగిరి రిజర్వాయర్లలో నీరు అడుగంటింది. నెల్లూరు చెరువులో కూడా అదే పరిస్థితి నెల్కొంది. నమోదైన వర్షపాతం వివరాలు చూస్తే ఈ ఏడు కూడా జిల్లా కరువు కోరల్లో చిక్కుకుంటుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కరువుబృందం పర్యటించినా.. ప్రభుత్వం ఎలాంటి సాయం ప్రకటించలేదు
కేంద్ర కరువు బృందం ఈ ఏడాది ఏప్రిల్ 2న జిల్లాలోని కరువు మండలాలలో పర్యటించింది. వరికుంటపాడు, దుత్తలూరు ప్రాంతాల్లో ఎండిన బత్తాయి తోటలను పరిశీలించింది. కరువు బృందం రైతులతో ముఖాముఖీ నిర్వహించింది. రాజకీయ, రైతు సంఘాల నుంచి వినతులు స్వీకరించింది. కరువు తీవ్రతను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారు పేర్కొన్నారు. జిల్లా తరుపున కలెక్టర్ జానకి జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను వివరిస్తూ కరువు బృందానికి నివేదికలు ఇచ్చారు. కేంద్ర కరువు బృందం పర్యటన అనంతరం జిల్లాకు సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదికలను అందించింది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి సాయం ప్రకటించ లేదు. ఈ ఖరీఫ్‌లోను అవే పరిస్థితులు పునరావృతం కావడంతో అన్నదాతలు పొలాలను వదిలి వలసబాట పట్టారు.
తరుముకొస్తున్న కరువు
Published Fri, Aug 7 2015 2:07 AM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM
Advertisement
Advertisement