‘రాజధానిలో ఇల్లు కొనుక్కుని ఉంటా’
నిడమర్రు: తాము అధికారంలోకి రాగానే ప్రజా రాజధాని నిర్మిస్తామని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజధానిలో మంచి జరగాలంటే ఒక్క వైఎస్సార్ సీపీ ద్వారానే అవుతుందని ఆయన పేర్కొన్నారు. గుంటూరు జిల్లా నిడమర్రులో రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ... రాజధానిని తామే కడతామన్నారు. చంద్రబాబు ఇక్కడ అద్దె ఇంట్లో ఉంటున్నారని, రాబోయే రోజుల్లో తాను ఇల్లే కొనుక్కుని ఇక్కడ ఉంటానని ప్రజల హర్షద్వానాల మధ్య జగన్ ప్రకటించారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఒక్క ఇటుక కూడా వేయలేదని ఆక్షేపించారు. రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. తన బినామీల భూములున్న ప్రాంతాలను రియల్ ఎస్టేట్ జోన్ లో పెట్టి, రైతుల భూములను మామూలు జోన్ లో పెట్టారని ఆరోపించారు. రైతులకు ఇచ్చే వాణిజ్య స్థలాల్లో మాల్స్ పెట్టకూడదని ఆంక్షలు విధించడం అన్యాయమని అన్నారు. చంద్రబాబుకు భూములు ఇచ్చిన వారు మాత్రం 22 అంతస్థులు కట్టుకుని మాల్స్ పెట్టేందుకు అనుమతి ఇస్తున్నారని చెప్పారు.
రైతులకు ఏదైనా ఆదాయం వచ్చేట్టు చేయాలి కానీ, ఇదెక్కడి దిక్కుమాలిన రాజకీయమని ప్రశ్నించారు. చంద్రబాబు రైతుల కళ్లల్లో కన్నీళ్లు చూస్తున్నాడని, ఈ పరిస్థితి మారుస్తామన్నారు. రాజధాని రైతులకు అన్యాయం జరగనీయబోమని, ప్రతి రైతుకు అండగా ఉంటామని భరోసాయిచ్చారు. మరో రెండేళ్లు ఎలాగోలా భూములు కాపాడుకుంటే తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమని జగన్ అన్నారు. తర్వాత ఎవరూ భయంతో బతకాల్సిన అవసరముండదని భరోసాయిచ్చారు. రైతులకు అన్ని రకాలుగా వైఎస్సార్ సీపీ తోడుగా ఉంటుందని హామీయిచ్చారు.