'ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగుతా'
న్యూఢిల్లీ : టీఆర్ఎస్ విలీనం, పొత్తు ఉండవని తేలిపోయిందని... ఇక ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. నిన్న ఢిల్లీలో దిగ్విజయ్తో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 'అంతా మన మంచికే. టీఆర్ఎస్ వాళ్లు మాతో వచ్చినా రాకపోయినా ఇబ్బందేమీ లేదు. మేం ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారని అందరికీ తెలుసు.
కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుంది' అని అన్నారు. కాంగ్రెస్ను గెలిపించడంతో పాటు కేసీఆర్కి ధీటైన సమాధానం చెప్పే నాయకుడినే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని రేణుక అభిప్రాయపడ్డారు. ఈసారి తాను ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగుతానని పేర్కొన్నారు.