
పీసీసీ పదవి ఇస్తే కాదనను: గండ్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తనకు అప్పగించాలని అధిష్టానం భావిస్తే కాదనబోనని, పార్టీ ఏ బాధ్యత అప్పగిస్తే దాన్ని చిత్తశుద్ధితో విజయవంతంగా నిర్వర్తిస్తానని చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీతో పొత్తులు పెట్టుకుంటే.. అవకాశాలు కోల్పోతామన్న ఆవేదన కాంగ్రెస్ కార్యర్తల్లో, నేతల్లో ఉందని చెప్పారు.
గురువారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీ ఒంటరిగా వెళ్తేనే మంచిదన్న అభిప్రాయం ఎక్కువమంది నేతల నుంచి వినిపిస్తోందని తెలిపారు. అయినా పొత్తులు ఇతరత్రా అంశాలు అధిష్టానం చూస్తుందన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేర్చిందని, దీన్ని తప్పుబట్టడం అర్థం లేనిదన్నారు. తన స్థాయికి మించి జగన్ కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.