జగన్‌ను ఎదుర్కోలేకనే ఉద్యమాలు
Published Sun, Sep 8 2013 5:51 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తట్టుకునే శక్తి సీమాంధ్ర నాయకులకు లేదని, అందుకే ప్రజలను మభ్యపెడుతూ ఉద్యమం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ధ్వజమెత్తారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తున్నారని, ఈ కుమ్మక్కుపై అధినాయకత్వం దృష్టిపెట్టాలని సూచించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రోడ్లను మూసేసి, రైళ్లను ఆపేసి నేతలను నిర్బంధించిన ప్రభుత్వం ప్రస్తుతం ఎన్జీవోల సభకు రహదారులు ఎలా తెరిచిందని ప్రశ్నించారు. తెలంగాణ ఎంపీలు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్‌యాదవ్‌లు శనివారం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోల సభ దృష్ట్యా పోలీసులు అతిగా ప్రవర్తించారని, ఓయూ, నిజాం కళాశాల హాస్టళ్లలోకి దూరి విద్యార్థులను కొట్టారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి, డీజీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ హైదరాబాద్‌లో అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ‘‘విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని అహ్మద్‌పటేల్‌కు వివరించాం. ఇదే విషయాన్ని శనివారం రాజ్యసభలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. హైదరాబాద్‌ను కల్లోలిత ప్రాంతంగా మార్చి అరాచకాలు సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందువల్ల సీఎంను వెంటనే భర్తరఫ్ చేయాలని, ఆయన్ను వెంటనే మార్చాలని కోరాం. రాష్ట్రపతి పాలన పెడతారా లేక నాయకత్వ మార్పుచేస్తారా.. ఏదో ఒకటి త్వరగా చేయాలని రాజ్యసభలో గట్టిగా కోరాం’’ అని తెలిపారు. ముఖ్యమంత్రి సీమాంధ్ర జేఏసీ కన్వీనర్‌గా వ్యవహరిస్తుండగా కో-కన్వీనర్‌గా డీజీపీ దినేశ్‌రెడ్డి, చంద్రబాబు సమన్వయకర్తగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న డీజీపీ వెంటనే తన పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతగా అంగీకరించేందుకు ఎవరూ సిద్ధంగా లేరని, అలా చేస్తే హైదరాబాద్ అగ్నిగుండం అవుతుందని ఎంపీ అంజన్‌కుమార్ హెచ్చరించారు.
Advertisement
Advertisement