తెలంగాణ ప్రజల ఆకాంక్ష నె రవేరినందున తాను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పక్షానే నిలుస్తానని మెదక్ ఎంపీ విజయశాంతి అన్నారు.
తూప్రాన్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రజల ఆకాంక్ష నె రవేరినందున తాను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పక్షానే నిలుస్తానని మెదక్ ఎంపీ విజయశాంతి అన్నారు. తూప్రాన్ మండలం నాగులపల్లి, మనోహరాబాద్, లింగారెడ్డిపేట గ్రామాల్లో మంగళవారం ఎంపీ విజయశాంతి, గజ్వేలే ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తాను గత 16 సంవత్సరాలుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నానన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించేందునే టీఆర్‌ఎస్‌లో చేరానని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన వెంటనే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని ప్రకటించినందున తాను కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు రెండు కళ్ల సిద్ధాంతం ప్రచారం చేసుకుంటూ రెండు ప్రాంతాల ప్రజలను మోసగిస్తూ వచ్చారని ఆమె ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా ఎన్డీయే ప్రభుత్వ హయాంలో అడ్డుకున్నది తానేనని చంద్రబాబు ప్రకటించి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. అంతకు ముందు గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌లో చేరారన్నారు. ఆమెతో కలిసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఢిల్లీ పెద్దలు స్పష్టం చేశారని, వారి సూచన మేరకే నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు శ్రీశైలం యాదవ్, సుగుణమ్మ, నరెందర్‌రెడ్డి, మల్లేశ్‌యాదవ్, మహిపాల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మండలంలోని నాగులపల్లి, లింగారెడ్డిపేటలలో మంగళవారం ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నాగులపల్లిలోఅంగన్‌వాడీ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.