ఐసీడీఎస్‌లో వివాదం పరిష్కారం | icdl issues are solved | Sakshi
Sakshi News home page

ఐసీడీఎస్‌లో వివాదం పరిష్కారం

Published Fri, Dec 20 2013 6:59 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

icdl  issues are solved

 శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : శ్రీకాకుళం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆరు నెలల క్రితం తలెత్తిన వివాదం గురువారం పరిష్కారమైంది. అయితే అదే సమయంలో కొత్త సమస్య తలెత్తింది. వివరాల్లోకి వెళ్తే...స్రీ, శిశు సంక్షేమ శాఖలో ఒకే సీటులో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు పనిచేస్తున్న వ్యవహారం కోర్టు వరకు వెళ్లిన విషయం పాఠకులకు తెలిసిందే. సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సదాశివను విశాఖ జిల్లా పాడేరు, విశాఖలో పని చేస్తున్న భవానీ అనే సీనియర్ అసిస్టెంట్‌ను శ్రీకాకుళంలో నియమిస్తూ ఈ ఏడాది జూన్ నెలలో ఆర్‌జేడీ ఉత్తర్వులు జారీ చేయడం, బదిలీకి తాను అనర్హుడినంటూ సదాశివను కోర్టును ఆశ్రయించడం, హాజరు పట్టీలో ఇద్దరి సంతకాలు చేయించకపోవడం, సదాశివ బీరువాలకు వేసిన సీళ్లను కలెక్టర్ ఆదేశాల మేరకు పగులగొట్టడం వంటి వ్వవహారాలు నడిచాయి.

అటు తరువాత సదాశివ హైకోర్టును ఆశ్రయించి తనను పరిపాలనాపరమైన కారణాలతో బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారని, దీనికి రాష్ట్ర అధికారుల ఆదేశాలు ఉండాల్సి ఉండగా, దానిని తీసుకోలేదని తెలియజేశారు. దీనిపై కోర్టు ఆర్‌జేడీని కౌంటర్ దాఖలు చేయాలని కోరినప్పటికీ సరైన సాక్ష్యాధారాలతో కౌంటర్ దాఖలు చేయలేకపోయారు. దీంతో ఆర్‌జేడీ కోర్టుకు తప్పుడు సమాచారం అందించారని భావిస్తూ సదాశివను తిరిగి శ్రీకాకుళంలో నియమించాలని వారం రోజుల క్రితం తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఆర్‌జేడీ బుధవారం ఉత్తర్వులు వెలువరించగా, గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.
 
 కొత్త సమస్య ఉత్పన్నం !
 సదాశివను శ్రీకాకుళంలో తిరిగి నియమించటంతో కొత్తసమస్య తలెత్తింది. ఆ స్థానంలో పనిచేస్తున్న భవానీని వేరొకచోట నియమించే అవకాశాలు లేకుండా పోయాయి. బదిలీలపై ఆంక్షలు ఉండడమే దీనికి కారణం.అధికారులు మాత్రం దీనిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ విభిన్న వివరణలు ఇస్తున్నారు. భవానీని ఎక్కడ నియమించారని ఆర్‌జేడీ సౌభాగ్యలక్ష్మి వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా ఆమె సెలవులో ఉన్నారని,  విధుల్లో చేరిన తరువాత పీడీతో సహా ఎవరికి చెప్పకుండా సెలవు చీటి ఆయన టేబుల్‌పై పెట్టేసి వెళ్లిపోయారని చెప్పారు. ఆమెను శ్రీకాకుళం బదిలీ చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించగా.. బదిలీ చేశామని చెప్పా పెట్టకుండా వెళ్లిపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇదే విషయమై పీడీ భిన్నమైన వివరణ ఇచ్చారు. భవానీ శ్రీకాకుళంలో విధుల్లోనే చేరలేదని, తమకెవరికీ తెలియకుండా హాజరు పట్టీలో సంతకాలు చేసేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని భవానీ వద్ద ప్రస్తావించగా ఆరు నెలలుగా అధికారులు మానసిక వేదనకు గురి చేస్తున్నారని వాపోయా రు. జూన్ 25న విధుల్లో చేరి మూడు రోజుల పాటు సంతకాలు చేసిన తర్వాత హాజరు పట్టిని దాచి వేయడంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లానన్నారు. రాష్ట్ర అధికారులను కూడా స్వయంగా కలిశానని, లిఖితపూర్వకంగా విన్నవించినా ప్రయోజనం లేకపోయిందన్నారు.
 
 కోర్టును, ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించిన అధికారులు!
 జిల్లా ఐసీడీఎస్ అధికారులతో పాటు, రీజనల్ అధికారులు కోర్టును, జిల్లా ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించినట్లయ్యింది. సదాశివ బీరువాకు సీలు వేసినప్పుడు కలెక్టర్‌కు వేరొకరకంగా చెప్పి సీళ్లను పగలగొట్టించారు. అలాగే ఉన్నతాధికారుల అనుమతిని తీసుకొనే సదాశివను బదిలీ చేశామని కోర్టుకు మౌఖికంగా చెప్పినా ఆ ఉత్తర్వుల ప్రతిని పొందుపరచలేకపోవడంతో రీజనల్ స్థాయి అధికారులు కోర్టు ను తప్పుద్రోవ పట్టించారనే భావిస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement