
సాక్షి, బి.కొత్తకోట (చిత్తూరు జిల్లా): విద్య నేర్పిన గురువును శిష్యులు సేవించి తరించడం చూశాం.. విద్యార్థులకు శ్రద్ధగా విద్యా బుద్ధులు నేర్పిన గురువులనూ చూశాం.. కానీ, విద్యార్థులకు సొంత తండ్రిలా వారి ఆలనాపాలనా చేస్తున్న ఈ ప్రిన్సిపాల్ మాత్రం అందరికీ భిన్నం. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట సమీపంలోని బాలయోగి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ జీవీకే నాయుడు.. పాఠశాలలోని విద్యార్థుల్లో కొంతమందికి తరచూ ఈ ఫొటోలో ఉన్నట్లుగా తన స్వహస్తాలతో స్నానం చేయిస్తుంటారు. బయట వారికి ఇది కొత్తగా అనిపించినా ఇక్కడి పిల్లలకు మాత్రం ఇది మామూలే.
తమ ఆలనాపాలన ఆయన దగ్గరుండి ఎంతో శ్రద్ధగా చూసుకుంటారని విద్యార్థులు చెబుతున్నారు. చదువుపట్ల పిల్లలు మరింత శ్రద్ధ కనబరిచేందుకే ఆయన వారితో మమేకమై ఇలా చేస్తుంటారని.. విద్యార్థులతో కలిసి నిద్రిస్తుంటారని సహోపాధ్యాయులు చెబుతున్నారు. అన్నట్టు.. ఈ ప్రిన్సిపాల్ సేవా భావాన్ని గుర్తించిన ప్రభుత్వం కూడా పలుమార్లు పురస్కారాలు అందించింది. తల్లిలా శిక్షణ.. తండ్రిలా రక్షణ అంటే ఇదే కదూ!
Comments
Please login to add a commentAdd a comment