ఆదర్శ ప్రేమికులు
చీపురుపల్లి: మనిషి మరణానంతరం శరీరంతో పాటు అవయవాలు కూడా మట్టిలో కలిసిపోతాయి. అలా కలిసిపోకుండా మరొకరికి ఉపయోగపడతాయని తెలిసినా దానం చేసేందుకు ముందుకు వచ్చేవారు చాలా అరుదు. కలకాలం కలిసి ఉండేందుకు ఏడడుగులు వేసే సమయంలోనే మరణానంతరం అవయవాల దానం కోసం నిర్ణయం తీసుకున్న ఆ నవ దంపతులు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచారు.
వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు... పెద్దలను ఒప్పించారు...బంధువుల సాక్షిగా ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకున్న ఆ నూతన వధువరులు పెళ్లి పీటలపై నుంచే అవయవ దానానికి అంగీకరిస్తూ పత్రాలపై సంతకాలు చేశారు. వారిని చూసి వివాహానికి వచ్చిన బంధువులు, స్నేహితులు మొత్తం పదమూడు మంది అదే వేదికపై నేత్రదానానికి అంగీకరిస్తూ పత్రాలు సమర్పించారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలోని వంగపల్లిపేటలో శనివారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో గ్రామానికి చెందిన ఏనూతల అప్పారావు, పైడితల్లి అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు. అదే సమయంలో తమ మరణానంతరం శరీరంలో ఉండే అవయువాలన్నీ దానం చేసేందుకు నిర్ణయం తీసుకుని పట్టణానికి చెందిన మానవీయత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు బీవీ గోవిందరాజులుకు అంగీకార పత్రాలను అందజేశారు. వృత్యిరీత్యా కారు డ్రైవరుగా పనిచేస్తున్న అప్పారావు.. బీకాం చదువుకున్న పైడితల్లి తీసుకున్న నిర్ణయాన్ని వివాహానికి హాజరైన వారు గ్రామస్తులు అభినందించారు.