విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఎ) పరిధిలోని రణస్థలం మండలం కోస్టలో టీడీపీ నేత వేసిన అక్రమ లేఅవుట్ ఇది. 18 ఎకరాల విస్తీర్ణంలో వేసిన లేఅవుట్‌కు అనుమతుల్లేవు. కేవలం నాలా చెల్లించి చేతులు దులుపుకున్నారు. ఎటువంటి నిబంధనలు పాటించకుండా, అనుమతులు తీసుకోకుండా వేసిన లేఅవుట్‌లో ప్లాట్ల విక్రయాలు చేసేస్తున్నారు.
వీఎంఆర్‌డీఎ పరిధిలోని ఎచ్చెర్ల మండలం తోటపాలెం పంచాయతీ శివారు దుప్పలవలసలో వేసిన లేఅవుట్ ఇది. మొక్కలు, తుప్పలు మొలిచేసి ఎంత అధ్వాన్నంగా ఉందో ఈ చిత్రం చూస్తే అర్థమవుతుంది. కానీ ఈ లేఅవుట్‌లో ప్లాట్ల విక్రయాలే కాక.. మారు అమ్మకాలు కూడా జరిగాయి. విశేషమేమిటంటే ఈ లేఅవుట్ స్థలం కనీసం కన్వర్షన్ కూడా జరగలేదు. కన్వర్షన్ ఫీజు చెల్లిం చి, నిబంధనల మేర ప్రభుత్వానికి వదిలేసి రెవెన్యూ అధికారుల అనుమతి మేరకు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. కానీ అటువంటిదేమీ చేయకుండా అడ్డగోలుగా లేఅవుట్ వేసేసి విక్రయాలు జరిపేశారు.
తాజాగా ఎచ్చెర్ల మండలంలో 12 అనధికార లేఅవుట్లను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా లేఅవుట్ వేయడంతో సుమారు రూ.26 కో ట్ల మేర అపరాధ రుసుము విధించారు. తాజాగా కంచిలి, పూండి, గరుడుభద్రలో అనధికారికంగా వేసిన లేఅవుట్ల వ్యవహారం కలెక్టర్ జె.నివాస్ దృష్టికి వచ్చింది. వీరి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ టౌన్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్ (డీటీసీపీఓ) తన బృందంతో కలిసి వాటిని పరిశీలించి చర్యలకు ఆదేశించారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. గత ఐదేళ్ల కాలంలో ఇలాంటి అక్రమ లేఅవుట్లు లెక్కలేనన్ని వెలిశాయి. కానీ అధికారుల దృష్టికొచ్చినవి కేవలం 290 మాత్రమే. నోటీసులు జారీ చేసి, గట్టిగా ఒత్తిడి చేయడంతో వీటిలో 14 లేఅవుట్లకు సంబంధించి అనుమతులు తీసుకున్నారు. మిగతా వారు మొండికేశారు. అందమైన బ్రోచర్లతో ఆకట్టుకున్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతమని మభ్యపెట్టారు. వీఎంఆర్‌డీఎ పరిధిలో ప్లాట్ అంటే ఆషామాషీ కాదని ఊహాల్లో ఊరేగించారు. లేఅవుట్‌లో స్థలం తీసుకుని ఇల్లు కట్టుకుంటే ఉన్న పళంగా విలువ పెరిగిపోతుంది.. ప్లాట్ తీసుకుంటే సంవత్సరంలోనే రెట్టింపు అయిపోతుందని అరచేతిలో వైకుంఠం చూపించారు. ఇంకేముంది సొంతిల్లు కట్టుకుందామని... తమ పిల్లల కోసం స్థలం కొని పెట్టుకుందామని కలలు కన్న ఎంతోమంది రియల్టర్ల చేతిలో మోసపోయారు. అమ్మేసిన తర్వాత కొంతమంది రియల్టర్లు పత్తా లేకుండా పోయారు. క్రయవిక్రయాలు జరిగేంతవరకు చోద్యం చూసిన అధికారులు ఆలస్యంగా మేల్కొని నోటీసులు జారీ చేసే కార్యక్రమం చేపట్టారు.
పొజిషన్‌లో ఉన్న కొనుగోలుదారులు బుక్ అయిపోయారు. లేఅవుట్ వేసినవాళ్లు ఎక్కడో ఉన్నారు. అమ్మకాలు జరిపేసి చేతులు దులుపుకున్నారు. కొందరైతే పలాయనం చిత్తగించారు. ప్రస్తుతానికైతే కొనుగోలు చేసినవాళ్లు స్థలాల్లో ఉన్నారు. అధికారులు నోటీసులిస్తే గాని తెలియలేదు అది అక్రమ లేఅవుట్ అని. నోటీసులందుకున్నాక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అక్కడా ఇక్కడా అని కాకుండా జిల్లావ్యాప్తంగా అక్రమార్కుల చేతిలో నష్టపోయిన వారు ఉన్నారు. లేఅవుట్ వేసినోళ్లు స్థానికంగా లేకపోవడం... ఆ ప్లాట్లలో కొనుగోలుదారులుండటంతో అధికారికంగా పొజిషన్‌లో ఉన్న వారిపైనే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రలోభాలో, ముడుపులో తెలియదు గాని అనుమతి లేకుండా లేఔట్లు వేసినప్పుడు అధికారులు చూసీచూడనట్టు వదిలేశారు. కొనుగోళ్లు అయిపోయేంతవరకు చోద్యం చూశారు. ఇప్పుడేమో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కొనుగోలుదారులపై పడుతున్నారు.
ఇదీ విధానం..
లేఅవుట్ వేయాలంటే ముందుగా డిస్ట్రిక్ టౌన్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) లేదా విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఎ) అనుమతులు తీసుకోవాలి. అంతకుముందే లేఔట్ వేసే భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. దీనికి రెవెన్యూ అధికారులను సంప్రదించాలి. నిర్దేశిత రుసుం చెల్లించి ల్యాండ్ కన్వర్షన్ చేయించుకోవాలి. వ్యవసాయేతర భూమిగా మార్పు పొందాక డీటీసీపీ, వీఎంఆర్‌డీఎ నుంచి అనుమతి తీసుకోవాలి. లేఅవుట్ అనుమతి తీసుకునేముందు విస్తీర్ణంలో 10 శాతం కామన్‌సైట్ (సామాజిక స్థలం) కేటాయించాలి. విస్తీర్ణంలో 25 శాతం మేర రోడ్లు వేయాలి. వేసిన రోడ్లకు ఆనుకుని మొక్కలు నాటాలి. కాలువలు, విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే డీటీసీపీ లేదా వీఎంఆర్‌డీఎ అధికారులు లేఅవుట్ అనుమతిస్తారు. ఇవన్నీ చేస్తే గిట్టుబాటు కాదని, ఏదో ఒక కొర్రీ పెట్టి ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో అక్రమ రియల్టర్లు అనుమతులు తీసుకోకుండానే చాలా చోట్ల లేఅవుట్లు వేసేశారు.
అధికారికంగా 276 అక్రమ లేఅవుట్లు..
జిల్లాలో 290 అక్రమ లేఅవుట్లు ఉన్నట్టు అటు డీటీసీపీ, వీఎంఆర్‌డీఎ అధికారులు, ఇటు పంచాయతీ, విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వెలుగు చూశాయి. లేఅవుట్ అనుమతి ఫీజుతోపాటు ఓపెన్ సైట్ కేటాయించకపోవడం వలన ప్రభుత్వ ఆదాయానికి రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని వీఎంఆర్‌డీఎ, డీటీసీపీ, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆదేశాలు జారీ చేస్తుండగా, క్షేత్రస్థాయిలో ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కొరవడ్డాయి. కేవలం 14 లేఅవుట్ యజమానులు మాత్రమే తర్వాత అనుమతులు తీసుకున్నారు. మిగతా 276 లేఅవుట్లకు సంబంధించి నేటికీ అనుమతుల్లేవు. ఇవి కేవలం అధికారికంగా గుర్తించినవి. ఇక అధికారుల దృష్టికి రానివెన్నో ఉన్నాయి. వాస్తవానికైతే, అనధికార లేఅవుట్లలో చాలా వరకు ప్లాట్లు అమ్ముడైపోయాయి. వాటిలో దాదాపు నిర్మాణాలు జరిగిపోయాయి.
లేఅవుట్లు వేసినోళ్లు అందుబాటులో ఉండటం లేదు. వారెక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకుంది. ప్రస్తుతం కొనుగోలుదారులే అక్కడుంటున్నారు. ఇవి అనధికార లేఅవుట్లని, ప్రభుత్వానికి ఫీజు కట్టాలని పంచాయతీ సిబ్బంది అడుగుతుంటే.. తామెక్కడ కట్టగలమని, లేఅవుట్ వేసినోళ్లను అడగండని చెబుతున్నారు. దాంతో తమకు సంబంధం లేదని, కొనుగోలు చేసినప్పుడు సక్రమమా, అక్రమమా? అన్నది చూసుకోవాలని, ఎవరైతే అనుభవంలో ఉన్నారో వారే చెల్లించాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక నివాసితులు అందోళన చెందుతున్నారు. కొందరైతే అనుమతుల్లేవని ప్లాన్ అప్రూవల్ లభించక, లక్షలాది రూపాయలు చెల్లించి కొనుగోలు చేసిన ప్లాట్లలో నిర్మాణాలు చేపట్టలేక ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఎటువంటి అనుమతులు లేని అక్రమ లేఅవుట్లు కావడంతో డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాల కల్పన విషయాన్ని అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. దీంతో నివాసితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
అక్రమ లేఅవుట్లు..
శ్రీకాకుళం డివిజన్ 223
టెక్కలి డివిజన్ 20
పాలకొండ డివిజన్ 33
అక్రమ లేఅవుట్లపై డ్రైవ్ పెడతాం..
జిల్లాలో ఉన్న అక్రమ లేఅవుట్లపై సంబంధిత శాఖలతో కలిసి డ్రైవ్ పెడతాం. ఇప్పటికే కొన్ని చోట్ల గుర్తించి చర్యలకు సూచించాను. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉన్న శాఖలతో లేఅవుట్లపై చర్యలు తీసుకుంటాం.
– పి.నాయుడు, డిస్ట్రిక్ట్ టౌన్ కంట్రీ ప్లానింగ్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment