అమలాపురంలో రౌడీమూకలపై గురి
ఆరు రౌడీ గ్యాంగ్‌ల గుర్తింపు
త్వరలో 40 మందిపై రౌడీషీట్లు తెరిచే అవకాశం
అమలాపురం టౌన్ : కోనసీమ కేంద్రమైన అమలాపురం రౌడీలకు అడ్డాగా మారుతోంది. పచ్చని సీమలో పగలు ప్రతీకారాలు, దాడులు ప్రతిదాడులు, అధిపత్యపోరు పెరిగిపోతోంది. దీంతో పోలీసులు రౌడీమూకలకు ముకుతాడు వేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా రౌడీలను కటకటాల్లోకి నెడుతున్నారు. గతంలో అమలాపురం పట్టణంలో రెండు ప్రధాన సామాజికవర్గాల గొడవలు జరిగేవి.
తరచూ ఇరువర్గాలు కవ్వించు
చర్యలకు పాల్పడేవి. ఆ రెండు వర్గాల నుంచి గత రెండు దశాబ్దాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇలాంటి వర్గ వైషమ్యాలను ప్రోత్సహించకుండా వాటిని దూరం చేశారు. అయితే ఇప్పుడు పట్టణానికి రౌడీయిజం అనే రోగం పట్టుకుంది. ఓ సామాజిక వర్గం నుంచి పుట్టిన ఆకు రౌడీలను పోలీసులు ఆదిలోనే అదుపు చేయలేదు. వారి వెనుక రాజకీయ అండ ఉందన్న కారణంతో వారి జోలికి వెళ్లలేదు. ఇప్పుడు వారే ఏకు మేకులయ్యారు. పట్టణేతర ప్రజాప్రతినిధి ఒకరు, ఆయన పేరుచెప్పుకుని ఓ సోదరుడు, ఆయనకు సంబంధించిన కొందరు అనుచరులు రౌడీయిజాన్ని పెంచిపోషిస్తున్నారన్న సమాచారం ఇంటిలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి చేరింది.
ఆరు రౌడీ గ్యాంగ్‌ల గుర్తింపు
ఇంటిలిజెన్స్ నివేదికతో అమలాపురం పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావటంతో రౌడీయిజం పీచుమనిచేందుకు సిద్ధమయ్యారు. అమలాపురం డీఎస్పీ లంక అంకయ్య ఆధ్వర్యంలో పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ ప్రైవేటు సెటిల్మెంట్లు, దాడులకు వ్యూహాలు, ఆయుధాలతో కుట్రలు పన్ని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై దృష్టిపెట్టారు. ఇలా 70 మంది రౌడీ మూకలను టార్గెట్ చేశారు. వీరంతా ఆరు రౌడీ గ్యాంగులుగా ఉండి పనులు సాగిస్తున్నారు. ఈ గ్యాంగ్‌లపై పోలీసులు కేసులు షురూ చేశారు. దీంతో అమలాపురంలోని బడా రౌడీలు దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులు ముందుగా చోటా రౌడీబ్యాచ్‌లను అరెస్టు చేసుకుంటూ వస్తున్నారు. గ్యాంగ్‌లీడర్లగా వ్యవహరిస్తున్న వారిపై కూడా కేసులు నమోదు చేసి, అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
పనిచేయని పైరవీలు
పోలీసులు దూకుడు చూసి భయపడి గ్యాంగ్‌లీడర్లు ఎప్పటిలాగే తమ రాజకీయ బాసులను ఆశ్రయించారు. అయితే ఇప్పుడు వారిని కాపాడే పరిస్థితి అండగా ఆ ప్రజాప్రతినిధికి లేకుండా పోయింది. దీంతో రౌడీల పని అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఒకరినొకరిపై ఈ విషయమై ఫిర్యాదులు చేసుకుంటూ ఆ పంచాయతీని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తీసుకువెళ్లినట్టు తెలిసింది.
యువకులే ఎక్కువ
ఈ ఆరు రౌడీ గ్యాంగుల్లో మొత్తం 70 మంది రౌడీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో 50 మంది వరకూ 20 నుంచి 25 ఏళ్లు ఉన్న యువకులే. ఇందులో దాదాపు 40 మంది యువకులు తరచూ ఏదో వివాదాల్లో ఉండటం... ఏదో కేసుల్లో ఉండటం వంటి పరిణామాలతో వారిని ఆదిలోనే అదుపు చేసేందుకు వారిపై కొత్తగా రౌడీషీట్లు తెరవాలని పోలీసులు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇందుకు సంబంధించి ఫైలు కూడా పోలీసు ఉన్నతాధికారుల పరిశీలనతో ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాలన్నీ అమలాపురానికి చెందిన హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పపై మిశ్రమ ప్రభావాలు చూపుతున్నాయి. గతంలో అమలాపురానికి ఏ ప్రజాప్రతినిధి ఎన్నికైనా... మంత్రి పదవి వచ్చినా రౌడీలపై ఉక్కుపాదం ఇంతలా ఎప్పుడూ మోపలేదు. రాజప్ప వచ్చిన తర్వాతే రౌడీలపై పోలీసుల దూకుడు ఎక్కువవటంతో రౌడీలు, వారి కుటుంబాల వారు ఆయనపై కారాలు నూరుతున్నారు.
పోలీసుల దూకుడు
Published Mon, Feb 23 2015 1:26 AM | Last Updated on Tue, Oct 2 2018 3:04 PM
Advertisement
Advertisement