చంద్రబాబు చెయ్యేస్తే.. ఎట్లా ఉంటాదో.. తెలుసా.. | If the Chief Minister Chandrababu Is Doing, The Artillery Industries Will Be Shut Down | Sakshi
Sakshi News home page

చంద్రబాబు చెయ్యేస్తే.. ఎట్లా ఉంటాదో.. తెలుసా..

Published Sun, Mar 10 2019 11:15 AM | Last Updated on Sun, Mar 10 2019 8:01 PM

If the Chief Minister Chandrababu Is Doing, The Artillery Industries Will Be Shut Down - Sakshi

ప్రొద్దుటూరు పాల ఉత్పత్తుల కర్మాగారం

సాక్షి, ప్రొద్దుటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు చెయ్యేస్తే.. ఎట్లా ఉంటాదో.. తెలుసా.. కళకళలాడుతున్న పరిశ్రమలు మూతపడిపోతాయి. సంతోషంగా సాగుతున్న జీవితం రోడ్డు పాలవుతుంది. ఇందుకు నిదర్శనం ప్రొద్దుటూరు పాల పదార్థాల కర్మాగారం.. అందులో పని చేసిన కార్మికులు. ఆ పరిశ్రమ మూతపడటంతో.. వారు దుర్భరమైన పరిస్థితిని అనుభవిస్తున్నారు. ప్రొద్దుటూరులోని పాల ఉత్పత్తుల కర్మాగారం(ప్రొద్దుటూరు మిల్క్‌ ఫ్యాక్టరీ) ఒకప్పుడు దేశ స్థాయిలో ఖ్యాతి గాంచింది. పాలకుల నిర్లక్ష్యం మూలంగా మూతపడింది. దీంతో వేలాది మంది కార్మికులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు.

ప్రొద్దుటూరు ప్రాంత అవసరాలను గుర్తించి ప్రొద్దుటూరు మిల్క్‌ ఫ్యాక్టరీ (పీఎంఎఫ్‌) ఏర్పాటు చేశారు. 1974లో పరిశ్రమ ఏర్పాటుకు పనులు ప్రారంభం అయ్యాయి. 1980 మార్చి 16న అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఈ కర్మాగారాన్ని ప్రారంభించారు. పెన్నానది ఒడ్డున 42 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పారు. కర్మాగారం ప్రాంగణంలో ఉద్యోగుల క్వార్టర్స్‌ నిర్మించారు. అనతికాలంలోనే విశేష ఖ్యాతి సంపాదించింది. ఓ రకంగా సిరినగరికే వన్నెతెచ్చింది.

కార్మికుల కృషితో ఎనలేని కీర్తి గడించడమే కాకుండా.. వందలాది గ్రామాల్లోని రైతులకు ఉపాధి కల్పించింది. గ్రామాల్లో నేటికీ పీఎంఎఫ్‌ భవనాలు సాక్షాలుగా ఉన్నాయి. మిలిటరీలో పని చేస్తున్న రక్షణ సిబ్బందికి ఇక్కడ తయారు చేసిన పాల ఉత్పత్తులను సరఫరా చేసే వారు. ప్రతి నెలా మిలిటరీ అధికారులు పాల కేంద్రంలోని గెస్ట్‌హౌస్‌ (అతిథి గృహం)లో విడిది చేసి.. తమకు అవసరమైన సరుకును తీసుకెళ్లే వారు. స్వచ్ఛమైన పాలు లభించడంతోపాటు పెన్నానది తీరాన పరిశ్రమ ఉండటంతో.. ఇక్కడి ఉత్పత్తులు చాలా నాణ్యతగా ఉండేవని పేరు వచ్చింది.

 కార్మికుల పరిస్థితి దయనీయం
ఈ పరిశ్రమలో 350 మంది పర్మినెంట్‌ ఉద్యోగులతోపాటు మరో 100 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేసే వారు. రోజూ జిల్లాతోపాటు పక్క జిల్లాల నుంచి రైతులు కర్మాగారానికి పాలు సరఫరా చేసే వారు. రోజు వారీగా లక్షా 50 వేల లీటర్లు సరఫరా కాగా.. వీటి ద్వారా పాల ఉత్పత్తులు తయారు చేసేవారు. స్కీం మిల్క్, హోల్‌ మిల్క్, నెయ్యి, బేబి ఫుడ్‌ లాంటి వాటిని తయారు చేసి విక్రయించే వారు. బేబి ఫుడ్‌ ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా అయ్యేదని ఉద్యోగులు నేటికీ చెబుతుంటారు. ఎంతో మంది లారీ ట్రాన్స్‌పోర్టేషన్‌ ద్వారా జీవనం సాగించే వారు.

ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది ప్రస్తుతం రోడ్ల పాలయ్యారు. ఆర్థికంగా ఉన్న కొంత మంది జీవితాలు మెరుగుపడినా.. ఉద్యోగంపైనే ఆధారపడి జీవించే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని చూసి తట్టుకోలేక చాలా మంది తనువు చాలించారు. ఇప్పటికే 60–70 మంది చనిపోయి ఉంటారని, కర్మాగారంలో పని చేసిన ఓ సెక్యూరిటీ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది జిరాక్స్‌ సెంటర్లు పెట్టుకోవడం, కూల్‌ డ్రింక్స్, టీ షాపులు,  ఇతర దుకాణాలను ఏర్పాటు చేసుకుని జీవితాలను నెట్టుకొస్తున్నారు. చివరికి వీఆర్‌ఎస్‌ కూడా సక్రమంగా చెల్లించలేదనే విమర్శలు ఉన్నాయి. వీఆర్‌ఎస్‌ చెల్లింపుపై నేటికీ ఉద్యోగులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. చివరికి వీఆర్‌ఎస్‌ చెల్లింపులో కూడా చిత్తూరు జిల్లాతో పోల్చితే తమకు అన్యాయం చేశారని ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నారు.

చంద్రబాబు హయాంలో మూసివేత
ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ డెయిరీ ద్వారా నడుస్తున్న పరిశ్రమను తర్వాతి కాలంలో సహకార సంఘం పరిధిలోకి బదలాయించారు. ప్రభుత్వ అలసత్వం, పాలకుల నిర్లక్ష్యంతోపాటు పర్యవేక్షణ లేమితో 1995 తర్వాత పరిశ్రమను మూసివేశారు. 1997 నాటికి పరిశ్రమను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత చిత్తూరు జిల్లాలోని పరిశ్రమను కూడా మూసివేయడం జరిగింది. 
నెరవేరని మంత్రి హామీ 
దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ప్రొద్దుటూరుకు పశువైద్య కళాశాల మంజూరైంది. రూ.115 కోట్లతో నిర్మించిన కళాశాల శాశ్వత భవనాలను ప్రారంభించేందుకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 2015 ఏప్రిల్‌ 7న ప్రొద్దుటూరుకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పీఎంఎఫ్‌కు పూర్వ వైభవం తీసుకొస్తామని ప్రకటించారు. ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై అ«ధ్యయనం చేస్తామని చెప్పారు. అదే నెల 19న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఎండీ బీవీ రమణమూర్తి పరిశ్రమను పరిశీలించి వెళ్లారు. ఆ నివేదిక ఏమైందో నేటికీ తేలలేదు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ హామీగానే మిగిలిపోయింది. 

వైఎస్‌ హయాంలో పాలశీతలీకరణ కేంద్రం 
చంద్రబాబు నాయుడు హయాంలో మూతపడిన పాల ఉత్పత్తుల కర్మాగారాన్ని చూసి చలించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2005 ఆగస్టు 3న ఇదే ప్రాంగణంలో పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 2006 జనవరి 1 నుంచి 5 వేల లీటర్ల సామర్థ్యంతో ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఈ పరిశ్రమను సైతం ప్రభుత్వం ప్రైవేటు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంబశివ డెయిరీకి అప్పగించింది. 2008 నుంచి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంజూరు చేసిన పశువైద్య కళాశాలను.. ఈ పరిశ్రమలోని భవనాల్లో తాత్కాలికంగా నడిపారు. 2015 వరకు ఇందులోనే కళాశాలను నిర్వహించి తర్వాత గోపవరం వద్దకు మార్చు చేశారు. 

ప్రభుత్వ ప్రోత్సాహంలేకపోవడం వల్లే..
ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం వల్లే 1995లో పీఎంఎఫ్‌ మూతపడింది. స్థానిక రాజకీయాల ప్రభావం ఉన్నా.. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు సహకార రంగాలపై సరైన అభిప్రాయం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాల ఉత్పత్తిదారుల పరిశ్రమలతోపాటు చక్కె పరిశ్రమలను మూసివేశారు. అప్పటి వరకు జిల్లాలో ప్రైవేటు పాడి పరిశ్రమలు లేవు. తర్వాతే హెరిటేజ్‌ డెయిరీ వెలుగులోకి వచ్చింది. పీఎంఎఫ్‌ ఉన్న సమయంలో జిల్లా వ్యాప్తంగా 380 సొసైటీలు ఉండేవి. వాటి ద్వారా రైతులతోపాటు నిరుద్యోగులకు ఉపాధి లభించేది. పరిశ్రమలో పని చేసే కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ.. అప్పట్లో నేను నిరవధిక నిరాహార దీక్ష చేపట్టగా 12వ రోజు రాత్రి పోలీసులు ఎత్తివేశారు. మళ్లీ రెండు రోజులు కలెక్టరేట్‌ను నిర్బంధించాం. రూ.4.92 కోట్ల బకాయిలను ఇప్పించాం. – జి.ఓబులేసు, సీపీఐ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు.
ఒకప్పుడు వెలుగు వెలిగింది
పీఎంఎఫ్‌ రాష్ట్రంలోనే ఒకప్పుడు వెలిగిపోయింది. తర్వాత కాలంలో మూతపడింది. ఉద్యోగులు రోడ్ల పాలయ్యారు. ఇంతటి దయనీయ పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. 
– ఎం.మాబువల్లి, రిటైర్డు సెక్యూరిటీ గార్డు, పీఎంఎఫ్‌

ఉత్పత్తులు నాణ్యతగా ఉండేవి
పరిశ్రమలో తయారు చేసిన ఉత్పత్తులు చాలా నాణ్యతగా ఉండేవి. దూర ప్రాంతాల నుంచి వచ్చి వీటిని తీసుకెళ్లేవారు. ఇక్కడి వాతావరణం కూడా ఇందుకు కారణం.
– ఎన్‌.లింగయ్య, ల్యాబ్‌ అసిస్టెంట్, పీఎంఎఫ్‌ 

సీఎంను కలిసినా ఫలితం లేదు 
1997 నుంచి 1999 వరకు పని చేసినందుకు గాను 22 నెలల పూర్తి వేతనాన్ని ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధికారులు పలుకక పోవడంతో స్వయంగా తాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి  సమస్యను విన్నవించాం. తర్వాత మంత్రి ఆదినారాయణరెడ్డితోపాటు జిల్లాలోని ముఖ్య నాయకులను కలిశాం. ఎవరూ పట్టించుకోలేదు. పైగా ప్రభుత్వం వేతనాలు ఇవ్వలేమని కోర్టు ద్వారా తెలిపింది. దీనిపై కండెంప్ట్‌ ఆఫ్‌ కోర్టుకు వెళ్లాం. 
– జి.సూర్యనారాయణ, పీఎంఎఫ్‌ ప్లాంట్‌ ఆపరేటర్, ప్రొద్దుటూరు.

ఎన్నో కుటుంబాలు దీన స్థితిలో ఉన్నాయి
పీఎంఎఫ్‌లో పని చేసిన ఎన్నో కుటుంబాలు నేడు దీనస్థితిలో ఉన్నాయి. ఎవరూ కనికరించే పరిస్థితిలో లేరు. 300 మందికి సుమారు రూ.3 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నాం. 
– కె.శ్రీనివాసులు, పీఎంఎఫ్‌ ఉద్యోగి, ప్రొద్దుటూరు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement