పోలవరం/పోలవరం రూరల్ : భూములు ఇవ్వకపోతే అభివృద్ధి ఆగిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పోలవరం మండలంలో పట్టిసీమ వద్ద నిర్మించిన కొవ్వాడ అవుట్‌ఫాల్ స్లూయిజ్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. సముద్రంలో వృథాగా కలిసిపోతున్న గోదావరి జలాలను పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నదికి అక్కడి నుంచి కరువు ప్రాంతాలకు తరలిస్తామన్నారు. వరదల సమయంలో కొవ్వాడ ప్రాంతం ముం పునకు గురై రైతులు నష్టపోయేవారన్నారు. ఇకపై వరద నీటిని కొవ్వాడ అవుట్‌ఫాల్ స్లూయిజ్ ద్వారా గోదావరిలోకి మళ్లిస్తామన్నారు.
ఈ పథకం రెగ్యులేటరీ సిస్టమ్ బాగుందని, అధికారులు మంచి ప్రాజెక్టు నిర్మించారని అభినందించారు. తాడిపూడి, చింతలపూడి పథకాలను కూడా పూర్తిచేసి మెట్ట ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. అనంతరం పట్టిసీమ ఎత్తిపోతల పథకం హెడ్‌వర్క్స్ నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న చంద్రబాబు అధికారుల నుంచి పనుల వివరాలను తెలుసుకున్నారు. రాళ్లను ముక్కలు చేసే యంత్రంపైకి ఎక్కి అది ఎలా పనిచేస్తుందోననే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఫొటో ఎగ్జిబిషన్, మ్యాప్ పాయింట్ ద్వారా పథకం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం పట్టిసీమ కాంట్రాక్ట్ ఏజెన్సీ కార్యాలయం వద్దకు చేరుకుని పైప్‌ల తయారీని పరిశీలించారు. పైప్‌ల నాణ్యతపై ఆరా తీశారు.
అక్కడి నుంచి ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పోలవరం కుడికాలువలో కలిసే 1.50 కిలోమీటరు వద్దకు చేరుకుని పైప్‌లు వేసే పనులను పరిశీలించారు. అక్కడి నుంచి వెంకటాపురం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు వాహనంలో చేరుకున్నారు. మార్గంమధ్యలో రామయ్యపేట పునరావాస కేంద్రాన్ని కాన్వాయ్ నుంచే పరిశీలించారు. ఆయన వెంట మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, ఎం పీలు మాగంటిబాబు, తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యేలు మొడియం శ్రీనివాస్, ప్రభుత్వ విప్‌లు చింతమనేని ప్రభాకర్, అంగర రామ్మోహన్, ఎమ్మెల్యేలు కేఎస్ జవహర్, మొడియం శ్రీనివాసరావు, ముప్పిడి వెంకటేశ్వరరావు, ఆరిమిల్లి రాధాకృష్ణ, నిమ్మల రామానాయుడు, కలెక్టర్ కె.భాస్కర్, ఎస్పీ భాస్కర్ భూషణ్, ఇంజినీరింగ్ ఛీప్ ఎం.వెంకటేశ్వరరావు, ఎస్‌ఈ వీఎస్ రమేష్‌బాబు జేసీ పి.కోటేశ్వరరావు ఉన్నారు.
భూములు ఇవ్వకపోతే అభివృద్ధి ఆగిపోతుంది
Published Sat, May 16 2015 5:02 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM
Advertisement