ఇలా అయితే మళ్లీ క్రాప్ హాలిడేనే! | If so, farmers go on re-Crop Holiday | Sakshi
Sakshi News home page

ఇలా అయితే మళ్లీ క్రాప్ హాలిడేనే!

Published Wed, Oct 30 2013 4:13 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

If so, farmers go on re-Crop Holiday

 కారంచేడు, న్యూస్‌లైన్: సరికొత్త విధానాలతో శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తూ కారంచేడుకు జిల్లా ధాన్యాగారంగా పేరు తీసుకొచ్చిన ఆ ప్రాంత రైతులు ప్రస్తుతం వ్యవసాయమంటే హడలిపోతున్నారు. ప్రతి ఏటా ప్రకృతి కన్నెర్రజేయడం.. పంటలు నీటిపాలవడం లేదా ఎండిపోవడం సాధారణంగా మారింది. గిట్టుబాటు ధరలు మృగ్యమయ్యాయి. దీంతో వ్యవసాయానికి ప్రత్యామ్నాయ మార్గాలవైపు చూస్తున్న రైతుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీనికి తోడు కొమ్మమూరు, రొంపేరు కాలువలు ఆధునికీకరణకు నోచుకోకపోవడం అతి పెద్ద సమస్యగా మారింది. గతంలో సంభవించిన ఓగ్ని తుఫాను వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కారంచేడులో పర్యటించి ఆ రెండు కాలువల వల్లే పంటలకు అధికంగా నష్టం కలుగుతున్నట్లు గుర్తించారు. వాటిని అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించారు. కానీ నేటి పాలకుల నిర్లక్ష్యం వల్ల పాత కథే పునరావృతమవుతోంది.
 
 నాటి గిట్టుబాటు ధరలు ఏవీ..
 వైఎస్ హయాంలో రైతులంతా ఆత్మతృప్తి చెందేవారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. అప్పట్లో క్వింటా ధాన్యం రూ. 1450 వరకు పలకడం రికార్డుగా ఉండేది. ఆయన తదనంతరం రైతుల గురించి పట్టించుకొనేవారు లేకపోవడంతో కారంచేడు ప్రాంతంలో పండిన ధాన్యం ఇళ్లకే పరిమితమైంది. 2008-09, 2009-10, 2010-11 సంవత్సరాల్లో గ్రామం నిండా నిండిన పురులే దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో రైతులు రోడ్లు ఎక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే కానీ ఎంతోకొంత ధరకు ధాన్యం అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. 2011-12 సంవత్సరంలో అయితే నీరు లేక.. పాలకుల నుంచి ఎలాంటి హామీ లేక రాష్ట్రం మొత్తం మీద మొదటిసారిగా ఈ ప్రాంత రైతులు ‘క్రాప్‌హాలిడే’ ప్రకటించాల్సి వ చ్చింది. దీంతో వేల ఎకరాలు బీడు భూములుగా మారాయి. ఈ ఏడాదైనా తమ జీవి తాలు మారతాయనుకుంటున్న తరుణంలో బంగాళాఖాతం రూపంలో దురదృష్టం మళ్లీ తలుపు తట్టింది. చాలా కాలం నుంచి ధాన్యం తడవకుండా ఇంటికి వచ్చిన సందర్భాలే తక్కువని అన్నదాతలు వాపోతున్నారు. తుఫానులు లేదా వరదలు లేదా అకాల వర్షాల వంటి కారణాలు రైతు కంటిమీద కునుకులేకుండా చేయడం పరిపాటిగా మారింది. వ్యవసాయం లాటరీగా మారిన నేపథ్యంలో పెట్టుబడులన్నీ ఆవిరైపోవడం..  అప్పులు పెరగడం సాధారణమైంది.
 
 ఇంకా నీటిలోనే..
 కారంచేడు గ్రామానికి ఉత్తరం, దక్షిణం, కుంకలమర్రు తూర్పు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న సుమారు 5 వేల ఎకరాలు ఇంకా వరద నీటిలోనే నానుతున్నాయి. వారానికి పైగా ఇలాంటి పరిస్థితే ఉండడంతో ఏం చేయాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు. పర్చూరు వాగుకు ఎగువన, స్వర్ణ, రంగప్పనాయుడువారిపాలెం ప్రాంతాల్లో పొలాలు కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement