
ఏ ప్రాంతంలో ఉంటే అక్కడే ఓటు
రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్పష్టీకరణ
విశాఖపట్నం: ఉద్యోగ, ఉపాధి రీత్యా ఏ ప్రాంతంలో ఉంటే అక్కడే విధిగా ఓటుహక్కు కలిగి ఉండాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాలులో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నివాసం ఒక చోట..ఓటు హక్కు మరొక చోట ఉంటే ఓటు కోల్పోయే ప్రమాదముందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు..లేదా ఉద్యోగ, ఉపాధిరీత్యా ఇక్కడ ఉంటున్నవారు స్థానికంగా ఓటు హక్కు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని, అడిగితే తమ ఊరులో ఓటుహక్కు ఉందని చెబుతున్నారని చెప్పారు.
ఆధార్ సీడింగ్ పూర్తయితే ఎక్కడైతే నివాసముంటారో అక్కడే ఓటుహక్కు ఉంటుందని, మిగిలిన ప్రాంతాల్లో ఉన్న ఓటుహక్కును నకిలీగా నిర్ధారించి తొలగిస్తామన్నారు. నగరాలు, పట్టణాల్లో ఓటర్ల జాబితాలలో సమూలమార్పులు తీసుకొస్తున్నట్టు చెప్పారు. ఈనెల 20కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధార్ సీడింగ్ పూర్తి చేయాల్సిందేనన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న విశాఖ, కాకినాడ కార్పొరేషన్లతో పాటు ఇతర మున్సిపాల్టీల్లో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఓటరు-ఆధార్‌సీడింగ్ ఎంతగానో దోహదపడుతుందన్నారు.