
కబ్జాలు చేస్తే ఖబడ్దార్
సివిల్ వివాదం అనుకోవద్దు
చట్టంలో అవకాశం ఉంది
ప్రభుత్వ ఉద్యోగులనూ వదలం
సీపీ ఎ.బి.వెంకటేశ్వరరావు
విజయవాడ సిటీ : భూ కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. కబ్జాదారుల పనిపట్టేందుకు చట్టంలో అన్ని రకాల ప్రొవిజన్స్ ఉన్నాయని ఆయన తెలిపారు. సోమవారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసు కమిషనర్ మాట్లాడుతూ..రాజధాని నేపథ్యంలో పెరిగిన భూముల ధరలను ఆసరాగా చేసుకుని నయా బ్రోకర్లు తయారయ్యారని చెప్పారు. ఏదో విధంగా వివాదం సృష్టించి కబ్జాకు పాల్పడడం..లేదంటే రాజీపేరిట డబ్బు గుంజడం చేస్తున్నారన్నారు.
కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్ల అవతారం ఎత్తినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఖాళీ భూములకు ఫోర్జరీ డాక్యుమెంట్లు, లేని భూములకు పట్టాలు సృష్టించి క్రయ విక్రయాలు జరుపుతున్నట్టు గుర్తించామన్నారు. ఇందుకు డాక్యుమెంటు రైటర్లు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు సహకరిస్తున్నారని చెప్పారు. ఇటీవల కానూరులో జరిగిన భూ వివాదంలో ప్రభుత్వ ఉద్యోగులు సహా పలువురిపై చట్టపరంగా చర్యలు చేపట్టామన్నారు. ఓ మతిస్థిమితం లేని వృద్ధురాలి ఆస్తికి జీపీఏ తయారు చేసి విక్రయించిన వైనం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో సివిల్ వివాదంగా పరిగణించి వదిలేస్తామనుకుంటే పొరపాటని, కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టంలో అన్ని అవకాశాలు ఉన్నాయనే విషయం గుర్తించాలని సీపీ హెచ్చరించారు.
చిట్‌ఫండ్ సంస్థల్లో డిపాజిట్ చేయొద్దు..
రిజిస్టర్ చిట్‌ఫండ్ సంస్థల్లో చిట్స్ మాత్రమే వేయాలి తప్ప.. డిపాజిట్లు చేయరాదని పోలీసు కమిషనర్ సూచించారు. కేవలం చిట్స్ మాత్రమే నిర్వహించే సంస్థలు దివాళా తీయడం లేదని, అలా కాక డిపాజిట్లు సేకరించి ఇతర వ్యాపారాల్లో మదుపు చేసే సంస్థలు మాత్రమే మూతపడుతున్నాయన్నారు.
498(ఎ) కేసులపై ప్రత్యేక శ్రద్ధ
వివాహ వ్యవస్థ అపహాస్యం కాకుండా మహిళల రక్షణను దృష్టిలో ఉంచుకొని వేధింపుల కేసు(సెక్షన్ 498(ఎ))ల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఏటా సగటున 1200 వరకు వేధింపుల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే పరిణామమన్నారు. వ్యక్తిగత ప్రతిష్టకు పోయి 70శాతం మంది తప్పుడు కేసులు పెడుతున్నారని గుర్తించినట్టు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుని సమాజనిర్మాణానికి, వ్యక్తిత్వ వికాసానికి కారణమైన వివాహ వ్యవస్థను ఛిన్నాభిన్నం కాకుండా చూడాలనేది తమ అభిప్రాయమన్నారు.
నేరాల నియంత్రణపై చర్యలు
నగరంలో ఆస్తి నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్మాని తెలిపారు.సీసీఎస్‌లోని నేర నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో కాలనీలు, రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్ వద్ద నేరాలు జరిగే విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇదే విధంగా నేరాలు జరిగే విధానాలపై పోస్టర్లు, కరపత్రాలు ముద్రించి ప్రజల్లో అవగాహనకు కృషి చేస్తున్నామని చెప్పారు. విలేకరుల సమావేశంలో డీసీపీ(పరిపాలన) జి.వి.జి.అశోక్‌కుమార్, అదనపు డిసీపీ(క్రైం) యం.నాగేశ్వరరావు, ఎసిపి(సిసియస్) గుణ్ణం రామకృష్ణ, సెంట్రల్ టి.లావణ్యలక్ష్మీ పాల్గొన్నారు.
సమస్యల నివారణ వ్యవస్థకు స్పందన
నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని సిబ్బంది, అధికారుల శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి గత నెల 8వ తేదీన నెలకొల్పిన పోలీసు సమస్యల నివారణ వ్యవస్థ(పోలీసు గ్రీవెన్స్ రిడ్రసల్ సిస్టమ్)కు మంచి స్పందన వచ్చిందన్నారు. పరిపాలనా డీసీపీ జి.వి.జి.అశోక్‌కుమార్ నేతృత్వంలో రూపొందించిన ఈ విధానం ద్వారా ప్రత్యేక ఫోన్ నంబర్‌కు 102మంది సంక్షిప్త సందేశాలు పంపగా, 94 సమస్యలను పరిష్కరించి తగిన సమాధానాలు పంపడం జరిగిందన్నారు. హెచ్‌ఆర్‌ఎ, జీపీఎఫ్, రుణాల మంజూరు, ట్రావెలింగ్ అలవెన్స్‌లు సహా ఇతర సమస్యల పరిష్కారానికి సిబ్బంది, అధికారులు కమిషనరేట్‌కు రాకుండానే యస్‌యంయస్ ద్వారా పరిష్కరించుకునేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తున్నట్టు తెలిపారు.