బనగానపల్లె, న్యూస్‌లైన్: దద్దణాల ప్రాజెక్టుకు ఒక్కసారిగా నీరొస్తే ప్రమాదం తప్పదు. ప్రాజెక్టుకు ఉండే రెండు క్రస్ట్‌గేట్లను ఎత్తేందుకు ప్రస్తుతం ఇక్కడ విద్యుత్ సరఫరా లేదు. దద్దణాల ప్రాజెక్టు కింద మండలంలోని సుమారు 1513 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు నుంచి కిందికి నీటిని విడుదల చేసేందుకు రెండు క్రస్ట్‌గేట్లు ఏర్పాటు చేశారు. ఇందు కోసం 24 గంటల విద్యుత్ సరఫరాను ఇక్కడి నుంచి మూడు కి.మీ దూరంలోని పాతపాడు విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలో విద్యుత్ వినియోగం ద్వారా క్రస్ట్‌గేట్లను పైకి లేపేందుకు అవసరమైన చర్యలను కూడా గతంలో అధికారులు తీసుకున్నారు. ఐదేళ్లుగా వరుసగా ఈ ప్రాంతంలో నెలకొన్న అనావృష్టి పరిస్థితుల వల్ల ప్రాజెక్టులో చుక్క నీరులేదు. దీంతో ప్రాజెక్టుకు అభివృద్ధిని సంబంధిత అధికారులు మరిచారు. రెండున్నరేళ్లుగా ప్రాజెక్టుకున్న విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
నీరు లేదని అజాగ్రత్త వద్దు: ప్రాజెక్టులో నీరులేదని అధికారులు అజాగ్రతగా ఉండడం మంచికాదని, అనుకోని విధంగా భారీ వర్షపాతం నమోదైతే పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పదేళ్ల క్రితం ప్రాజెక్టు నిండా నీరు చేరడంతో ఇలాగే సాంకేతిక కారణాల వల్ల ప్రాజెక్టు క్రస్ట్ గేటు పని చేయకపోవడంతో ప్రాజెక్టు పైభాగం నుంచి నీటి ప్రవహించింది. అప్పటికప్పుడు అధికారులు స్పందించి ప్రాజెక్టు తూమును పొక్లెయిన్లతో మరింత వెడల్పు చేసి నీటిని కిందికి విడుదల చేయడంతో ప్రమాదం తప్పింది. మళ్లీ అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించవలసిన అవసరం ఉందని పలువురు రైతులు కోరుతున్నారు.
లోపించిన సౌకర్యాలు
ప్రాజెక్టు వద్ద సిబ్బంది ఉండేందుకు వసతి సౌకర్యాలు పూర్తిగా లోపించాయి. ఇక్కడ లస్కర్లు ఉండేందుకు సౌకర్యాలు లేవు. గతంలో ఉన్న క్వార్టర్లు నేలకూలాయి. ఇబ్బందుల మధ్యే వారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడున్న ప్రతి వస్తువు దొంగల పాలవుతోంది. విద్యుత్ సరఫరాకు సంబంధించిన సామగ్రి కూడా దొంగల పాలైంది. అందవల్లే ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా లేదు. ప్రస్తుతానికి ఇక్కడ ఒక చిన్న రూమ్ అయినా నిర్మించాల్సిన అవసరం ఉంది. సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం.
- భాస్కర్ బాబు, ఏఈ దద్దణాల ప్రాజెక్టు
నీరొస్తే.. అంతే
Published Thu, Sep 12 2013 3:41 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement