అధికారుల నిర్లక్ష్యం.. వినియోగదారులకు శాపం
అధికారుల నిర్లక్ష్యం.. వినియోగదారులకు శాపం
Published Thu, Feb 9 2017 10:09 PM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM
– మీటర్ల ఏర్పాటు, పర్యవేక్షణలో అలసత్వం
– విజిలెన్స్ దాడుల్లో వెలుగులోకి.. వినియోగదారులపైనే కేసులు
– ఇటీవలే బనగానపల్లె ఏఈపై సస్పెన్షన్ వేటు
– మిగిలిన వారిపై చర్యలకు సిద్ధపడని అధికారులు
కర్నూలు(రాజ్‌విహార్): కమర్షియల్ కనెక‌్షన్లకు మీటర్లు పెట్టడం, నిరంతరం పర్యవేక్షించడం ఏఈల బాధ్యత. అయితే కింది స్థాయి సిబ్బందికి పనులు చెప్పి వదిలేస్తున్నారు. అక్కడ తప్పులు జరిగి వేలాది యూనిట్లకు లెక్క లేకుండా పోతోంది. చివరకు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో పొరపాట్లు వెలుగులోకి రావడంతో ఆ తప్పును వినియోగదారులపైనే వేసి కేసులు పెట్టి రూ.లక్షల జరిమానా విధిస్తున్నారు. ఇలాంటి ఓ కేసు విషయంలో వినియోగదారుడిపై రూ.5.34లక్షలు జరిమానా విధించి, బనగానపల్లె రూరల్స్ ఏఈ పుల్లయ్యపై సస్పెండ్ చేశారు. కాగా ఇది వరకే ఉన్న పలు కేసుల విషయంలో బాధ్యలైన వారిపై చర్యలకు అధికారులు సిద్ధ పడడంలేదని తెలిసింది. ఉన్నతాధికారుల వైఖరి పట్ల విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ద్వంద నీతిపై పవర్ డిప్లొమా, ఇంజినీర్ల సంఘం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. దీనిపై సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.
ఎస్‌పీడీసీఎల్ కర్నూలు సర్కిల్‌లో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వినియోగదారులకు శాపంగా మారింది. కనెక‌్షన్లు, మీటర్ల వద్ద ఏర్పడిన సమస్యను సకాలంలో గుర్తించకపోవడంతో బాధితులు ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా పెద్ద సర్వీసులపై నిఘా లేకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ పొరపాట్లు జరుగుతున్నట్లు తెలిసినా పట్టించుకోవడం లేదు. అవి పెద్దగా మారి వినియోగదారుడి తలపై కుంపట్లు తెచ్చి పెడుతున్నాయి. నిబంధన ప్రకారం పరిశ్రమలు, టవర్లు, ఇతర భారీ కనెక‌్షన్లపై ఏఈలు నిరంతరం పర్యవేక్షణ సాగించాలి. కమర్షియల్ కనెక‌్షన్లు, టవర్లకు సీటీ మీటర్లు (ఏయే సమయాల్లో ఎంతెంత విద్యుత్ కాల్చారో తెలియజేస్తుంది) ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ కొందరు చేతివాటం ప్రదర్శించి ఈ నిబంధనలను మరిచిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే విజిలెన్స్ అధికారులు దాడులు చేసి ఇలాంటి తప్పులతోపాటు వాటికి బాధ్యులైనవారి చిట్టాను కూడా బయటకు తీస్తున్నారు. వీటిపై విచారణ చేసి నివేదికలను ఉన్నతాధికారులకు పంపుతున్నా బాధ్యులపై చర్యలు కరువయ్యాయి. కంటితుడుపు చర్యగా నోటీసులు, మెమోలిచ్చి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది.
కొన్ని ఉదాహరణలు:
– కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లి గ్రామంలో ఇండస్ట్రియల్ సర్వీసు మీటర్ నంబర్ 1456ను 2015 సెప్టెంబరు7న డీపీఈ విజిలెన్స్ డీఈ ఎం. ఉమాపతి తనిఖీలు నిర్వహించారు. మీటర్ల వద్ద అమర్చిన సీల్ బిట్ కట్ కావడంతోపాటు స్పాట్ బిల్లింగ్‌లో అవకతవకలు, చౌర్యం జరిగిందని భావించి రూ.5,84,951లను జరిమానా విధించారు. దీనికి ఏఈ పర్యవేక్షణ లోపం ఉన్నట్లు నివేదికలు ఇచ్చినా ఎలాంటి చర్యలు లేనట్లు తెలుస్తోంది.
– నంద్యాల మండలంలోని కానాలలో ఉన్న ఇండస్ టవర్ సర్వీస్ నంబర్ 1112ది కూడా అలాంటి సమస్యే. దీనిపై 2015 జూలై 17న ఏడీఈ బి. జీవరత్నం తనిఖీలు నిర్వహించి రూ.5,84,436 జరిమానా విధించారు. ఇందులో కూడా బాధ్యలైన వారిపై చర్యలు లేవు.
– అదే మండలం అయ్యలూరులోని సర్వీస్ (నంబర్ 1347) ఇలాంటి కారణం చేత వినియోగదారుడు వెంకటరామిరెడ్డిపై రూ.1,03,600 జరిమానా విధించారు. 2008 మే13న కేసు నమోదైనా బాధ్యులపై చర్యలు లేవు.
– మిడ్తూరులోని బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌కు ఏర్పాటు చేసిన మీటర్ కాలిపోయింది. ఈ సమస్య గత జూన్ నుంచి ఉన్నా అధికారులు పట్టించుకోకుండా మీటర్ బర్న్ స్టేటస్–11 కింద బిల్లింగ్ యావరేజ్‌గా తీశారు. ఇది 2016డిసెంబరు 17న విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయటకొచ్చింది. అధికారులు బీఎస్‌ఎన్‌ఎల్‌కు 8వేల యూనిట్లకు రూ.69వేలు జరిమానా విధించారు. ఇందులో తమ తప్పేమి లేదని, విద్యుత్ అధికారులు పర్యవేక్షించకుండా జరిమానా విధించారని బీఎఎస్‌ఎన్‌ఎల్ నందికొట్కూరు ఎస్‌డీఈ మహేంద్ర తెలిపారు.
– కర్నూలులోని బీ. రోడ్డు సెక‌్షన్‌లో ఉన్న బార్, రెస్టారెంట్ కనెక‌్షన్ (నంబర్ 42520)కూ ఇలాగే జరిగింది. స్పాట్ బిల్లింగ్‌కు ఏఈ వెళ్లకుండా కింది స్థాయి సిబ్బందిని పంపడంతో రీడింగ్‌లో అవకతవకలు చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని 2013లో అప్పటి డీఈ తనిఖీలు నిర్వహించి బ్యాక్ బిల్లింగ్ కింద రూ.6లక్షలు జరిమానా విధించారు. ఇందులో అధికారి నిర్లక్ష్యం ఉందని నివేదికలు ఇచ్చినా ఎలాంటి చర్యలు లేవు.
ఒకరిపైనే చర్యలు.. గుర్రుమంటున్న ఇంజినీర్లు
బనగానపల్లె మండలం వెంకటాపురంలో ఇండస్ టవర్‌కు హెచ్‌టీ మీటరు ఏర్పాటు చేయాల్సి ఉండగా సాధారణ మీటర్ ఏర్పాటు చేశారు. ఇది విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో తేలింది. టవర్ యజమానికి రూ.5.34లక్షల జరిమానా విధించడంతోపాటు ఏఈ పర్యవేక్షణ లోపం ఉందంటూ నివేదికలు ఇవ్వడంతో ఈనెల 1న బనగానపల్లె రూరల్స్ ఏఈ పుల్లయ్యపై సస్పెన్షన వేటు వేశారు. అయితే గతంలో జరిగిన సంఘటల్లో బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఇంజినీర్స్, పవర్ డిప్లొమా ఇంజినీర్స్ సంఘాలు ఈనెల 3న ఆందోళన నిర్వహించి ఎస్‌ఈని కలిసి ప్రశ్నించారు.
Advertisement