వైఎస్‌ఆర్ జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి, మరో విద్యార్థిని అదశ్యమయ్యారు.....
వేంపల్లె : వైఎస్‌ఆర్ జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి, మరో విద్యార్థిని అదశ్యమయ్యారు. శనివారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో వీరు ట్రిపుల్ ఐటీ నుంచి వెళ్లినట్లు తెలుస్తోంది. విద్యార్థుల అదృశ్యంపై ఆర్‌కే వ్యాలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఏవో విశ్వనాథరెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఆకువీడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు పి.నవీన్, చిత్తూరు జిల్లా విజయపురం మండలానికి చెందిన విద్యార్థిని 2014లో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చేరారు. వీరిద్దరూ ఏ-6 తరగతి గదిలో చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వీరు అదృశ్యమయ్యారు.
ఉదయం 8 గంటలకు వీరు తరగతి గదిలోకి రాకపోవడంతో పలుచోట్ల గాలించారు. ఆచూకీ లేకపోవడంతో విషయాన్ని అధికారులు వారి తల్లిదండ్రులకు తెలిపారు. వీరి మొబైల్ ఫోన్లు ఇక్కడే వదిలేసి వెళ్లడంతో అందులో ఉన్న మెసేజ్‌లు, ఫోన్ నెంబర్ల ఆధారంగా కొంత సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ శేషయ్య తెలిపారు.